Disha Effect : బదిలీ అయిన చెల్పూర్ ల్యాబ్ టెక్నీషియన్..

ఎట్టకేలకు హుజురాబాద్ మండలం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ బదిలీ అయ్యాడు.

Update: 2024-07-28 09:26 GMT

దిశ, హుజురాబాద్ రూరల్ : ఎట్టకేలకు హుజురాబాద్ మండలం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ బదిలీ అయ్యాడు. గత 15 ఏళ్లుగా చెల్పూర్ పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ బదిలీ జాబితాలో పేరు లేకపోవడం పై దిశ పత్రికలో ఈనెల 14న "వైద్య ఆరోగ్యశాఖలో బది..లీలలు" అనే వార్తా కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన వైద్యఆరోగ్య శాఖ అధికారులు బదిలీల జాబితా పై దృష్టి సారించింది. ఈ తతంగం రాష్ట్రవ్యాప్తంగా నెలకొనడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిదామోదర రాజనర్సింహ బదిలీల జాబితా పై ఇంటెలిజెన్స్ విచారణ చేపట్టాలని ఆదేశించారు. దీంతో బదిలీల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలు బయటపడ్డాయి. ఈ మేరకు చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న చినబాబు అనే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ - II ఉద్యోగికి చాలా కాలంగా ఒకే చోట పనిచేస్తున్నట్లు విచారణలో వెళ్లడైంది.

దీంతో ఇతనికి వెంటనే అధికారులు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. వీణవంక మండలం చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ చేస్తూ శనివారం సాయంత్రం రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ బదిలీ ఉత్తర్వుల కాపీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు పంపించారు. కాగా రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖకు జరుగుతున్న సాధారణ బదిలీల్లో కొన్ని ఉద్యోగ సంఘాలు ఆఫీస్ బేరర్ల పేరుతో ఏళ్లకు ఏళ్ళు ఒకేచోట తిష్ట వేసుకొని కూర్చున్న ఉద్యోగులకు తప్పుడు దృవపత్రాలు ఇచ్చి, వారిని బదిలీల నుంచి తప్పించాలని చూశారు. అలాగే ఉన్న చోటనే పోస్టింగ్ ఇప్పించుటకు పెద్ద మొత్తంలో అవినీతి చోటుచేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ విచారణలో బయటపడ్డ ట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్ తప్పుడు జాబితాలు తయారు చేసిన ఉద్యోగుల పై చర్యలకు ఆదేశించినట్లు తెలిసింది.

Tags:    

Similar News