ఆత్మీయ సమ్మేళనాల జాడేదీ?

వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని అధికార పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజలకు చేరువ కావాలని సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు.

Update: 2023-05-16 02:52 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి/కొడిమ్యాల: వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని అధికార పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజలకు చేరువ కావాలని సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నిర్వహించే ఈ సమ్మేళనాలలో కార్యకర్తలు, నాయకులను అందరిని కలుపుకొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధిష్టానం సూచించింది. అనుకున్నది ఒకటైతే అయింది మరొకటి అన్నట్లుగా తయారైంది అధికార పార్టీ పరిస్థితి. ఆత్మీయ సమ్మేళనంలో ప్రజలకు చేరువయేందుకు చేసే ప్రయత్నాలు అటు ఉంచితే పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలతో నాయకులు సతమతమవుతున్నారు. దీంతో కొన్ని చోట్ల కావాలనే సమ్మేళనాలు నిర్వహించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

లోపించిన సమన్వయం..

ప్రజలకు చేరువయ్యేందుకు, నాయకుల మధ్య సమన్వయం పెంచడంతోపాటు పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. అయితే జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు నియోజకవర్గ స్థాయిలోనే సరిపెడుతూ తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రాల్లో ఆత్మీయ సమ్మేళనాల ఊసే ఎత్తడం లేదు. జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్న కొన్ని మండలాలలో ఆత్మీయ సమ్మేళనాలు ఇంతవరకు జరగలేదు. జిల్లాలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ యావర్ రోడ్డు అంశం ప్రస్తావించగా స్పందించిన మంత్రి కొప్పుల సమావేశంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు చేరవేయాలని కానీ కొత్తగా నిధులు అడిగేందుకు కాదని అన్నారు. దీంతో నొచ్చుకున్న ఎమ్మెల్యే అనుచరులు ఆ తర్వాత రాయికల్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి డుమ్మా కొట్టారు. మరోవైపు కోరుట్లలో నిర్వహించిన సమ్మేళనానికి కొందరు నాయకులు తమను బలవంతంగా తీసుకువచ్చారని రైతులు ఆరోపణలు చేశారు.

అక్కడ జాడలేని సమ్మేళనాలు..

జిల్లాలోని కొడిమ్యాల, మల్యాల, పెగడపల్లి, ఇబ్రహీంపట్నం మండలాలలో ఆత్మీయ సమ్మేళనాల జాడే కనిపించడం లేదు. చొప్పదండి నియోజకవర్గం లోని కొడిమ్యాల మండలంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు స్థానికంగా ఉన్న ప్రైవేటు రిసార్ట్ లో సన్నాహక సమావేశం నిర్వహించి డేట్ ఫిక్స్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేశారు. కొడిమ్యాల, మల్యాల మండలాలకు సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులకు స్థానిక ఎమ్మెల్యేకు మధ్య వచ్చిన గ్యాప్ కారణంగా పార్టీ రెండుగా చీలిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయా మండలాలకు సంబంధించి విస్తృతస్థాయి సమావేశం గంగాధర మండల కేంద్రంలో నిర్వహించినప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని అధికార బీఆర్ఎస్ వర్గాలే చర్చించుకుంటున్నాయి.

అదే కారణమా..!

ఇటీవల కాలంలో అధికార పార్టీలో పెరుగుతున్న గ్రూపు రాజకీయాలతో పాటు సెన్సిటివ్ గా ఉన్న కొన్ని మండలాలలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేందుకు ఎమ్మెల్యేలు వెనకాడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మండల స్థాయి సమావేశాలకు వచ్చే సర్పంచులు లక్షల్లో ఉన్న పెండింగ్ బిల్లుల కోసం నిలదీసే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యేలు తూతు మంత్రంగా సమ్మేళనాలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

Tags:    

Similar News