టికెట్ దక్కేదెవరికి..? జగిత్యాల BJP శ్రేణుల్లో అయోమయం
దిశ, జగిత్యాల : అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయమే ఉండటం.. అవసరమైతే అధికార టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళుతుందని ఊహాగానాల
దిశ, జగిత్యాల: అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయమే ఉండటం.. అవసరమైతే అధికార టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళుతుందని ఊహాగానాల నేపథ్యంలో జగిత్యాల కమల దళంలో కలవరం మొదలైంది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జగిత్యాల అసెంబ్లీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా ఎగురవేయడంలో సఫలమయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో నిజామాబాద్ ఎంపీగా కవిత పై బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ విజయం సాధించడంతో బీజేపీ క్యాడర్ లో నూతన ఉత్సాహం వచ్చింది.
అదే జోరుతో జగిత్యాల నియోజకవర్గంలో కవిత ప్రాబల్యం తగ్గించేందుకు ఎంపీ అర్వింద్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అధికార పార్టీ నుంచి కొంతమంది నాయకులకు గాలం వేస్తున్నారని సమాచారం. ఇంత వరకు బాగానే ఉన్నా.. అధికార పార్టీ అభ్యర్థిని నిలువరించి పైచేయి సాధించడానికి బీజేపీ కి బలమైన నాయకుడు లేడనే చర్చ ప్రస్తుతం పార్టీలో జోరుగా నడుస్తుంది. నియోజకవర్గంలో ఇప్పటికే బలంగా ఉన్న కాంగ్రెస్, టీఆర్ఎస్ లను ఓడించే దీటైన అభ్యర్థి వేటలో బీజేపీ నాయకులు ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రాధాన్యత ఎవరికి..?
ఇటీవలే జిల్లా పర్యటనకు వచ్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రానున్న రోజుల్లో బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని, ఇప్పటికే ఆ దిశగా సంప్రదింపులు సైతం జరుగుతున్నాయని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లా బీజేపీ లో ప్రకంపనలు మొదలయ్యాయి. కేవలం టికెట్ ఆశించి అధికార పార్టీ నుంచి వచ్చే వారికి ప్రాధాన్యత ఇస్తారా లేక మొదటి నుంచి పార్టీ కోసమే పని చేస్తున్న కొంతమంది జిల్లా స్థాయి నాయకులకు టికెట్ ఇస్తారా? అని నేతలు అయోమయంలో పడినట్లు తెలుస్తుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి టికెట్ మాత్రం ఖచ్చితంగా కొత్త అభ్యర్థికే ఇస్తారని కింది స్థాయి నేతలు చర్చించుకున్నట్టు సమాచారం.
పోటాపోటీగా కార్యక్రమాలు..
పార్టీలో కీలకంగా వ్యవహరించే కొంతమంది జిల్లా స్థాయి నాయకులు టికెట్ తమకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచే అందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. కొంతమంది నాయకులు ఇప్పటికే నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా అక్కడ వాలిపోతున్నారు. మరి కొంతమంది నాయకులు ఆర్థిక సహాయాలతో పాటు సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయోమయంలో కార్యకర్తలు..
అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు బీజేపీలో చేరడం పట్ల కార్యకర్తలు పార్టీ బలపడుతుందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ టికెట్ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే టికెట్ రేసులో ఉన్న నాయకులకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇస్తే ఏం చేయాలని? ఎలా ముందుకు వెళ్లాలని? చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందనేది అనేది వేచి చూడాల్సిందే.