రేణుకా ఎల్లమ్మ ఆలయంలో చోరీ

Update: 2024-10-06 09:13 GMT

దిశ, చిగురుమామిడి: చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దొంగలు శనివారం రాత్రి ఆలయ ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని గౌడ సంఘం అధ్యక్షుడు బత్తిని మల్లేశం తెలిపారు. రోజూ లాగే ఆలయ పరిసరాలను శుభ్రపరచే వరుకోలు సమ్మయ్య ఆదివారం ఉదయం 5 గంటలకు ఆలయానికి వచ్చేసరికి అక్కడ ఇనుప చువ్వల తలుపు తాళం తీసి ఉండడం గమనించి గౌడ సంఘ సభ్యులకు తెలిపాడు. వారు వెంటనే ఆలయం వద్దకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు ఎత్తుకెళ్లిన ఆభరణాల్లో రెండు బంగారు ముక్కుపుడకలు, పుస్తెమట్టెలు, వెండికళ్ళు, భక్తులు సమర్పించిన వెండి కళ్ళు అరవై వరకు ఉంటాయని గౌడ సంఘం నాయకులు తెలిపారు. దొంగిలించబడ్డ మొత్తం ఆభరణాల విలువ దాదాపు లక్షా యాభైవేల రూపాయల వరకు ఉంటుందని గౌడ సంఘం అధ్యక్షుడు బత్తిని మల్లేశం తెలిపారు. కాగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News