ఎండుతున్న పంట.. తల్లడిల్లుతున్న అన్నదాత
రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండటంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పంటలు ఎండిపోతున్నాయి.
దిశ, కోనరావుపేట : రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండటంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పంటలు ఎండిపోతున్నాయి. దాంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండల వ్యాప్తంగా దాదాపు 17 వేల ఎకరాల యాసంగి పంట సాగు చేశారు. మండలంలోని మరిమడ్ల, గొల్లపల్లి, వట్టిమల్ల, కొండాపూర్, బావుసాయిపేట, రామన్నపేట గ్రామాల్లోని పలు చోట్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. దాంతో పంట పొలాలకు సాగు నీరు అందక ఎండిపోతున్నాయి.
వట్టిమల్ల గ్రామానికి చెందిన గ్యారే రాములు అనే రైతు తన 5 ఎకరాల భూమిలో వరి పంట సాగు చేయగా బోరుమోటారుకు నీరు అందక పంట పూర్తిగా ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈసారి వేసవి కాలం ప్రారంభ దశలోనే ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమని ఆదుకొని పరిహారాన్ని అందించాలని కోరుతున్నాడు. ఇది రాములు ఒక్కడి పరిస్టితి కాదని, అనేక మంది రైతుల పంటలు ఇలాగే ఎండిపోతున్నాయని వాపోతున్నారు.