ఇసుక మాఫియా ఇష్టారాజ్యం.. తనిఖీలకు వెళ్లిన అధికారులపై దాడులు

జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. జిల్లా వ్యాప్తంగా ఇసుక

Update: 2024-06-26 15:10 GMT

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. జిల్లా వ్యాప్తంగా ఇసుక రవాణా చేసే వ్యాపారుల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లాలోని మానేరు, మూలవాగుల నుండి కొన్ని వేల ట్రిప్పుల ఇసుక అక్రమంగా తరలిపోతుంది. అర్ధరాత్రులు మొదలుకొని తెల్లవారుజామున వరకు ఇసుకాసురులు యదేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. ఇక ట్రాక్టర్ డ్రైవర్లు ర్యాష్ డ్రైవింగ్ తో సిరిసిల్ల, వేములవాడ పట్టణాలలో పాటు మానేరు, మూలవాగు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఆయా నిర్మాణ పనుల నిమిత్తం ఇసుక రవాణాకు అధికారులు అనుమతులు ఇస్తున్నప్పటికీ కొంతమంది వ్యాపారుల తీరుతో అధికారులు బెంబేలెత్తుతున్నారు. తనిఖీలకు వచ్చిన అధికారులపైనే దాడులకు తెగబడుతున్నారు. ఇసుక మాఫియా ఆగడాలు జిల్లాలో ఏ విధంగా కొనసాగుతున్నాయో తెలుపడానికి అధికారులపై జరుగుతున్న దాడులే నిదర్శనం. ఇటీవల అక్రమ ఇసుక ట్రాక్టర్ ను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న కానిస్టేబుల్ తో సహా ట్రాక్టర్ ను చెరువులోకి దింపిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో జిల్లాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అధికారులతో పాటు జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇసుక మాఫియా ఇష్టారాజ్యం

వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న మానేరు, మూలవాగుల నుండి ఇసుక, చెరువు నుంచి అధికారులు రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ అధికారులు ఇసుక, మట్టి, మొరం తరలించు కునేందుకు ట్రాకర్లు, టిప్పర్లు, పలు సందర్భాల్లో లారీలకు సైతం అనుమతులు మంజూరు చేస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది అక్రమార్కులు, ధనార్జనే ధ్యేయంగా అధికారుల కళ్లుగప్పి నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను, మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఓవర్ లోడ్, అతివేగం, మైనర్లకు వాహనాలకు ఇవ్వడం, వాహనాలకు సరైన ధ్రువ పత్రాలు కలిగి ఉండకపోవడం, వ్యవసాయానికి వినియోగించే వాహనాలను వ్యాపార నిమిత్తం వినియోగిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించిన అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తమ విధి నిర్వహణలో భాగంగా ఇదేంటని అడగడానికి వెళ్లిన అధికారులు, సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారు.

అడిగినా, అడ్డుకున్న దాడులే..

ఇక అక్రమాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా తరలింపులు జరుపుతున్న ట్రాక్టర్లను, టిప్పర్లను సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది వెళ్లి అడ్డుకుంటే కనీస మర్యాద ఇవ్వకుండా, అధికారులు అనే గౌరవం కూడా లేకుండా వారితోనే దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే అధికారులపై దాడులు చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇటీవల జిలాల్లోని వేములవాడ పట్టణంలో ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను అడ్డుకున్నందుకు ఓ మైనింగ్ అధికారికి, ట్రాక్టర్ డ్రైవర్ కి మధ్య వాగ్వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. చివరికి ఇరువురు దాడి చేసుకునే వరకు వచ్చింది. దీంతో పాటు ముస్తాబాద్ మండలంలోని నామపూర్ వద్ద అర్ధరాత్రి ఇసుక తరలిస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాకర్ ను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న తరుణంలో ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ ను నామపూర్ చెరువులోకి మళ్లించి, తాను పక్కకు దూకాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ సత్యనారాయణ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక్కడ కావాలనే డ్రైవర్ అలా చేశాడు అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

బెంబేలెత్తుతున్న అధికారులు..

ఇలా నిత్యం జిలాల్లో ఏదో మూలాన ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు, సిబ్బంది భయబ్రాంతులకు లోనవుతున్నట్లు తెలుస్తోంది. అధికారులపైనే ఇలా దాడులు జరిగితే ఇక మాకు దిక్కెవరనుకుంటూ, తమ గోడు ఎవరికి చెప్పాలో, ఏమి చేయాలో అర్థం కాక లోలోపల కుమిలిపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటేనే తమకు రక్షణ ఉంటుందని, లేదంటే అక్రమార్కుల ఆగడాలతో ఎప్పుడూ ఎవరికీ ఏమవుతుందోననే ఆందోళన చెందుతున్నట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

అయ్యో పాపం..

ఇదిలా ఉండగా సోమవారం అర్ధరాత్రి ఇసుకాసురుల ఆగడాలతో చెరువులో పడి తీవ్ర గాయాలై ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముస్తాబాద్ పోలీస్ కానిస్టేబుల్ సత్యనారాయణపై జిల్లా ప్రజలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో సైతం విధి నిర్వహణలో భాగంగా తనపై ఉన్న బాధ్యతలను విస్మరించకుండా, క్రమశిక్షణతో, న్యాయంగా విధులు నిర్వర్తిస్తే కానిస్టేబుల్ కు ఇలాంటి పరిస్థితులు రావడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సదరు కానిస్టేబుల్ కు సంబంధించిన వీడియోలను, ఫోటోలను చూస్తూ 'అయ్యో పాపం' ఇలా అయ్యిందేంటి అంటూ చర్చించుకుంటున్నారు. ఘటనకు బాద్యులైన వారి తీరు పట్ల మండిపడుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.

అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై జిల్లా పోలీసు శాఖ కొరడా ఝులిపిస్తుంది. జిల్లాలో ఇసుక స్మగ్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. నిన్న ఒక్కరోజే అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 ట్రాక్టర్ లను పట్టుకొని, 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశాం. కాగా 2024 సంవత్సరంలో ఇప్పటివరకు జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న 163 మందిపై కేసులు నమోదు చేసి, 161 వాహనాలు సీజ్ చేశాం. తరచు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న 14 కేసులలోని 21 మందిని రిమాండ్ కు తరలిస్తున్నాం. తరచు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే వాహనాల జప్తు కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అప్పజెప్పుతున్నాం. సబ్సిడీలో ట్రాక్టర్ లు వ్యవసాయ పనులు మినహా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే, ట్రాక్టర్లు సీజ్ చేసి సబ్సిడీ రద్దుకు సిఫార్సు చేస్తున్నాం. అనుమతి లేకుండా అక్రమ ఇసుక రవాణా నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందిస్తే, వెంటనే చర్యలు తీసుకుంటాం.

Similar News