భూ నిర్వాసితులకు చట్ట ప్రకారం నష్టపరిహారం : అదనపు కలెక్టర్

వరంగల్ -మంచిర్యాల మధ్య 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ కారిడార్ జాతీయ రహదారి

Update: 2024-06-29 13:02 GMT

దిశ, పెద్దపల్లి : వరంగల్ -మంచిర్యాల మధ్య 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ కారిడార్ జాతీయ రహదారి నిర్మాణంలో తమ భూములు, ఆస్తులు కోల్పోతున్న నిర్వాసితులకు చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ జీవి.శ్యామ్ ప్రసాద్ లాల్ తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారి భూ నిర్వాసితులతో సమావేశమై వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ వరంగల్-మంచిర్యాల మధ్య 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ కారిడార్ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు చట్ట ప్రకారం వీలైనంత మేరకు అధికంగా నష్టపరిహారం వచ్చే విధంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని అన్నారు.

జాతీయ రహదారుల నిర్మాణ అలైన్మెంట్ ను కేంద్రం పరిధిలోని సంస్థ నిర్ణయిస్తుందని, అలైన్మెంట్ మార్పు తమ చేతులలో ఉండదని అదనపు కలెక్టర్ తెలిపారు. జాతీయ రహదారి నిర్మాణం వల్ల తాము నష్టపోతున్నట్లు అందించిన ప్రతి దరఖాస్తును పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారించి చట్ట ప్రకారం పరిహారం అందజేస్తామని తెలిపారు. భూములకు చట్ట ప్రకారం రేటు చెల్లించడంతో పాటు, ఆ భూములలో ఉన్న బోర్లు, బావులు, చెట్లు, మోటార్లు, ఇండ్లు, పైప్ లైన్ మొదలగు ఆస్తులకు విలువ కట్టి నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి హనుమా నాయక్, తహసిల్దార్ లు, సంబంధిత అధికారులు, భూ నిర్వాసితులు, తదితరులు పాల్గొన్నారు

Similar News