సింగరేణి సివిల్ కాంట్రాక్టర్లకు చురక.. సంస్థాపరమైన పనులకు అడ్డంకులు కలిగిస్తే బ్లాక్ లిస్ట్‌లోకి

సింగరేణి రామగుండం-1 డివిజన్ సివిల్ కాంట్రాక్టర్లకు అధికార

Update: 2024-06-29 13:54 GMT

దిశ,గోదావరిఖని: సింగరేణి రామగుండం-1 డివిజన్ సివిల్ కాంట్రాక్టర్లకు అధికార యంత్రాంగం చురకలు పెట్టినట్లు తెలిసింది. ఇటీవల అర్జీ వన్ పరిధిలోని గోదావరిఖని ఐబీ కాలనీలో సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ భూక్యరాజు నిర్వహిస్తున్న సీసీ రోడ్డు పనులను గోదావరిఖనికి చెందిన పలువురు సివిల్ కాంట్రాక్టర్లు సైట్ మీదకు వెళ్లి పనులు అడ్డుకోవడంతో పాటు బలవంతంగా పనిముట్లు లాక్కొన్న సంఘటన పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన విషయం విధితమే. ఈ సంఘటనపై బాధిత కాంట్రాక్టర్ భూక్యరాజు సింగరేణి అర్జీ -1 జిఎం చింతల శ్రీనివాస్, కార్పొరేట్ సివిల్ జిఎం లకు ఫిర్యాదు చేశారు.

దీని ఆధారంగా స్థానిక జీఎం ఆదేశాల మేరకు సివిల్ ఎస్ఈ స్పందించి రెండు రోజుల క్రితం ఆ పనులను అడ్డుకున్న సివిల్ కాంట్రాక్టర్లను తన కార్యాలయంకు పిలిపించి దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. వ్యక్తిగత కక్షలను దృష్టిలో ఉంచుకొని సంస్థాపరమైన పనులను అడ్డుకొని సింగరేణిలో అశాంతి వాతావరణంకు కారణమైన సివిల్ కాంట్రాక్టర్లకు మొదటి తప్పుగా హెచ్చరించి మరోసారి సింగరేణి సంస్థకు సంబంధించి జరుగుతున్న పనుల వద్దకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ఎంతటి వారైనా బ్లాక్లిస్టులోకి చేర్చడం జరుగుతుందని హెచ్చరించినట్లు తెలిసింది. సింగరేణి సంస్థ నియమ నిబంధన ప్రకారం ఈ టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు సంస్థ పరంగా భద్రతా చర్యలు చేపడతామని తెలిపినట్లు తెలిసింది.

Similar News