రాజన్న ఆలయం, పట్టణ అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళ్దాం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కలిసికట్టుగా పని చేస్తూ, వేములవాడ పట్టణాన్ని, రాజన్న ఆలయాన్ని

Update: 2024-06-29 12:01 GMT

దిశ,వేములవాడ : కలిసికట్టుగా పని చేస్తూ, వేములవాడ పట్టణాన్ని, రాజన్న ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుదామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న ఆలయం, పట్టణ అభివృద్దే ప్రధాన ఎజెండాగా సమీక్ష నిర్వహించామని, అభివృద్ధిలో ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై కౌన్సిల్ సబ్యులకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. మూలవాగు, గుడి చెరువులోకి మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకుంటామని, పట్టణంలోని రోడ్ల వెడల్పు, మధ్యలో నిలిచిపోయిన మూలవాగు వంతెన నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. మహాలక్ష్మి వీధిలో సీసీ, డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేస్తామని, ఇప్పటికే రూ.20 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, త్వరలోనే మరిన్ని నిధులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

శ్యామకుంట మార్కెట్ ను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని, ఇప్పుడున్న 2వ బైపాస్ కూరగాయల మార్కెట్ ను అలాగే కొనసాగిస్తూ, శ్యామకుంట మార్కెట్ లో కూరగాయల విక్రయాలు జరిపించే విధంగా ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించినట్లు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధితోపాటు పట్టణ అభివృద్ధిలో ఎవరేమి సూచనలు, సలహాలు ఇచ్చినా అందరి సలహాలు సూచనలు స్వీకరిస్తామని భవిష్యత్తులో అందరి సూచనలను, సలహాలను పాటిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు పోదామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Similar News