ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి.. కాలుష్య కాసారంలో ఆర్‌ఎఫ్‌సీఎల్ పరిసర ప్రాంతాలు

కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై యూరియా సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఆర్‌ఎఫ్‌సీఎల్ కంపెనీని రామగుండంలో ప్రారంభించారు.

Update: 2024-09-19 01:36 GMT

దిశ, గోదావరిఖని టౌన్: కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై యూరియా సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఆర్‌ఎఫ్‌సీఎల్ కంపెనీని రామగుండంలో ప్రారంభించారు. సంతోషకరమైన విషయమే కానీ ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం యూరియా నుంచి వెలుపడే అమ్మోనియం కెమికల్ వాటర్‌ను రామగుండం ప్రజలు నివసిస్తున్న ఓపెన్ డ్రైనేజీ కాలువలోకి వదులుతుండటం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. కెమికల్ నీటితో గాలి, తాగునీరు కలుషితం అంవుతోంది. కెమికల్ గాలిలో కలవడంతో స్థానిక ప్రజలు ఊపిరాడక, కండ్ల మంటలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. కంపెనీ ప్రారంభించి ఉత్పత్తి మొదలైనా ఇప్పటి వరకూ రెటిఫీడ్ ఆఫీసర్‌ను నియమించుకోకపోవడం, కెమికల్ వాటర్ శుద్ధి చేసే జీరో లిక్విడ్ ప్లాంట్ నిర్మాణం చేపట్టకపోవడం ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రమాదాలు జరిగినప్పుడే కంపెనీ అధికారులు హడావుడి చేయడం ఆ తరువాత సమస్యను గాలికోదలడం తంతుగా మారింది.

జీరో లిక్విడ్ ప్లాంట్ ఏది?

యూరియా తయారీలో వెలువడే కెమికల్ శుద్ధి చేయడానికి జీరో లిక్విడ్ ప్లాంట్‌ను ఆర్‌ఎఫ్‌సీఎల్ కంపెనీ ఇప్పటి వరకు నిర్మించుకోలేదు. కెమికల్ వాటర్ తాగునీరు, గోదావరిలో కెమికల్ కలవడం వలన పర్యావరణానికి చాలా హానీ కలుగుతోంది. ఇప్పటికైనా ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం లాభాపేక్షను వదిలి జీరో లిక్విడ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. అదేవిధంగా కంపెనీ నుంచి రాత్రి, పగలు పెద్ద పెద్ద శబ్దాలు వెలువడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గాలిలోకి కెమికల్స్ వదలడంతో పెద్ద ఎత్తున మంటలు వస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు. 10 కి.మీ వరకు విపరీతమైన పెద్ద పెద్ద శబ్ధాలు వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పీసీబీ చర్యలు శూన్యం

ఆర్‌ఎఫ్‌సీఎల్ కంపెనీ నుంచి విడుదల కెమికల్ శబ్ధాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పొల్యూషన్ కంట్రోల్ అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని స్థానికులు తెలిపారు. పీసీబీ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇలాగే వ్యవహరిస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని సామాజిక కార్యకర్తలు వాపోతున్నారు.

కంపెనీ ప్రారంభం నుంచి సమస్యలతో జీవనం: గున్నాల శ్రీధర్ గౌడ్, స్థానికుడు

ఆర్‌ఎఫ్‌సీఎల్ కంపెనీ ప్రారంభం వల్ల ఈ ప్రాంత ప్రజలకు వింత వింత వ్యాధులు వస్తున్నాయి. స్థానిక నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రజల నివసిస్తున్న ప్రాంతాల్లోకి కెమికల్ వాటర్ రాకుండా అధికారులు చూడాలి.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు: బంగి అనిల్ కుమార్, మేయర్ 

రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ కంపెనీ యాజమాన్యంపై గోదావరి ఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. కెమికల్ వాటర్‌ను నేరుగా ప్రజలు నివసిస్తున్న కాల్వలోకి పంపడం వలన ఊపిరాడక, కండ్లు మంటలతో చాలామంది ఆసుపత్రుల పాలయ్యారు. ఆ విషయంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాం. రామగుండం కార్పొరేషన్ ప్రజలకు అండగా ఉంటుంది. ఇక అలాంటి ఘటనలు జరగకుండా ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యానికి నోటీసులు పంపించాం, చర్యలు తీసుకుంటాం. 


Similar News