Karimnagar Collector : పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి..

గురువారం మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పలువురు

Update: 2024-09-19 12:24 GMT

దిశ, మానకొండూరు : గురువారం మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పలువురు పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య కార్డులు, బీమా పత్రాలు, విధుల నిర్వహణకు అవసరమైన రక్షణ సామగ్రిని కలెక్టర్ పమేలా సత్పతి అందజేశారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో సఫాయి మిత్ర సురక్ష కింద కార్మికులకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సుమారు 1300 మంది పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు ఆరోగ్య కార్డులు అందిస్తామన్నారు. ఒక్కో కార్మికుడికి పంచాయతీ, మున్సిపల్ తరపున రూ.440 చెల్లించి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి కింద రూ.2 లక్షల వరకు ప్రమాద, సహజ మరణానికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పనులకు వచ్చేటప్పుడు ఆరోగ్య కార్డులు వెంట తెచ్చుకోవాలని కార్మికులకు సూచించారు. విధులు ముగించుకున్న తర్వాత తప్పనిసరిగా స్నానం చేసి ఇళ్లకు వెళ్లాలన్నారు.

అనంతరం అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే తొలిసారిగా కరీంనగర్ జిల్లాలోని పారిశుద్ధ్య కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఆసుపత్రికి ఆరోగ్య కార్డును వెంట తీసుకెళ్లి అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్మికులకు నెలకోసారి వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు ఐరన్ , విటమిన్ సి మాత్రలు అందించాలని వైద్యారోగ్య సిబ్బందిని కోరారు. యూనిసెఫ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల కోఆర్డినేటర్ వెంకటేష్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. పదేళ్ల కిందట ఫ్రాన్స్ దేశంలో తడి, పొడి చెత్తను వేరుగా సేకరించడం చూశామన్నారు. ప్రస్తుతం మన దేశంలో ఈ విధానం అమలవుతుండటం సంతోషంగా ఉందన్నారు. మిగతా జిల్లాల కంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. డీఎంహెచ్ఓ సుజాత మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు నెలకోసారి అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. డీఆర్డీవో శ్రీధర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులకు జిల్లా వ్యాప్తంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు ఆవరణలో పలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ సీ వైద్యాధికారి సౌమ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Similar News