Minister Konda Surekha : మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రాజన్న ఆలయ అభివృద్ధి

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని

Update: 2024-09-19 16:03 GMT

దిశ,వేములవాడ : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా అభివృద్ధి చేయాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రాజన్న ఆలయంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనుల పురోగతిపై దేవాదాయ శాఖ మంత్రి, ఆయా శాఖల మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి గురువారం సచివాలయంలోని దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు వేగంగా, సులభంగా దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆలయానికి ప్రత్యేకంగా ఆర్కిటెక్ ను నియమించి పక్కా ప్లాన్ ప్రకారం ఆలయ నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

ఆలయానికి ఇప్పటికే కేటాయించిన రూ.50 కోట్లతో శృంగేరి పీఠం వారి అనుమతి పూర్తయిన సందర్భంగా పనుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా ఆలయ పనులు పూర్తయిన తర్వాత బ్యాంకు లాకర్ లో ఉన్న బంగారంతో రాజన్న ఆలయాన్ని బంగారం తాపడంతో తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. రాజన్న సన్నిధిలో కార్తీక మాసం సందర్భంలో ప్రతి సోమవారం కోటి దీపోత్సవం నిర్వహించేలా చూడాలని అన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో సింథటిక్ శాలువాలు వాడకుండా చేనేత శాలువాలు, బ్యాగులు వాడేలా ఆదేశాలు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కు వారి కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఆయా ఆలయాల ఈ.ఓ లు స్థపతి ఎన్. వల్లి నాయగన్, ఎస్.ఈ కె. దుర్గా ప్రసాద్, సహాయ స్థపతి పి. గణేషన్, కన్సర్వేటివ్ ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్, శరత్, ఈ.ఈ రాజేష్, డీఈ రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.


Similar News