సెస్ ఎన్నికల్లో ఆసక్తి... ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పోటీ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరఫర సంఘం(సెస్) ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా...Special Story of Vemulawada Politics
దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరఫర సంఘం(సెస్) ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారాయి. వేములవాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకుడు, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబుతో నెలకొన్న విబేధాలతో గత కొన్నాళ్లుగా టీఆర్ఎస్ లోనే స్థబ్ధంగా ఉంటున్నాడు. రాజకీయ కార్యక్రమాలకు కూడా అల్లాడి రమేశ్ ను ఎక్కడకు పిలవకుండా.. వేములవాడ రాజకీయాల్లో కనమరుగు చేసే ప్రయత్నాలు జరగడంతో టీఆర్ఎస్ లో మదనపడ్డ అల్లాడి రమేశ్ ఎట్టకేలాకు ఈ సెస్ ఎన్నికల నేపథ్యంలో బీజేపి తీర్థం పుచ్చుకున్నారు. చివరివరకు మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేసి విఫలమై.. తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరాడు. దీంతో చందుర్తి మండలంలో బీజేపీకి బలం పెరిగినట్లు అయ్యింది. చందుర్తి రాజకీయాల్లో అల్లాడి రమేశ్ తనదైన మార్క్ తో పలుసార్లు సెస్ డైరక్టర్ గా సేవలందించారు. ఓసారి సెస్ చైర్మన్ గా కూడా అవకాశం దక్కించుకున్నాడు. వేములవాడ రాజకీయాల్లో కూడా అల్లాడి రమేశ్ కు మంచి పేరుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన అల్లాడి రమేశ్ 2016లో టీఆర్ఎస్ లో చేరాక.. రాజకీయంగా ఇబ్బందులు పడుతూ వచ్చారు.
ముఖ్యంగా వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబుకు అల్లాడి రమేశ్ కు ఎక్కడ రాజకీయ విబేధం వచ్చిందో తెలియదు కానీ.. టీఆర్ఎస్ లో మొత్తం పక్కన పెట్టేశారు. దీంతో అల్లాడి రమేశ్ బీజేపీలో చేరడమే కాకుండా తన భార్య నళిని వేములాడ టౌన్ 1 లో నామినేషన్ వేసి సెస్ డైరక్టర్ బరిలో ఉన్నారు. అల్లాడి రమేశ్ చందుర్తి సెస్ డైరక్టర్ స్థానానికి నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి శ్రీనివాస రావ్ కు ధీటైన అభ్యర్థిగా అల్లాడి ఎన్నికల బరిలో ఉన్నాడు. అల్లాడి రమేశ్ సోదరుడు సైతం రుద్రంగి డైరక్టర్ స్థానం కోసం పోటీ పడుతున్నాడు. దీంతో అల్లాడి రమేశ్ కుటుంబం రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఈ సెస్ ఎన్నికల్లో చర్చనీయంశంగా మారారు. వేములవాడ ఎమ్మెల్యేను తట్టుకుని సెస్ రాజకీయాల్లో సక్సెస్ అవుతారా..? లేదా చందుర్థితో టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించి.. తన సత్తాను టీఆర్ఎస్ కు చూపిస్తాడా వేచి చూడాలి. ఏది ఏమైనా చందర్తి బీజేపీలోనే కాదు వేములవాడ బీజేపిలో అల్లాడి రమేశ్ రాకతో బలం పెరిగినట్లయింది. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చందర్తి సెస్ డైరక్టర్ స్థానం బీజేపీ గెలుస్తుంది అంటూ చర్చించే పరిస్థితికి వచ్చింది. అల్లాడి రమేశ్ బీజేపీలో చేరడంతో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు సైతం చందర్తి మండలంపై ప్రత్యేక దృష్టి సారించి.. ఎలాగైన టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస రావ్ ను గెలిపించడానికి శతవిధాల ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. టీఆర్ఎస్ క్యాడర్ మొత్తం శ్రీనివాస్ రావ్ ను పని చేసి విజయం సాధించి తన వద్దకు రావాలని ఎమ్మెల్యే రమేశ్ బాబు టీఆర్ఎస్ శ్రేణులను ఆదేశించినట్లు సమాచారం. ఇక నుంచి చందుర్తి రాజకీయాలు వేములవాడ రాజకీయాలను ఏ విధంగా మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.
Also Read...
రూ. 68.11 కోట్లు 'kick back'! లిక్కర్ స్కామ్ చార్జిషీట్‌లో సీబీఐ