Collector Koya Sriharsha: గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

జిల్లాలో ఉన్న గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల వైద్య అధికారులు

Update: 2024-07-23 12:13 GMT

దిశ,పెద్దపల్లి : జిల్లాలో ఉన్న గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల వైద్య అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో ఉన్న పల్లె దవాఖాన, ఎలిగేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి , ప్రజలకు అందిస్తున్న వివిధ వైద్య సేవలపై ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రతి గర్భిణీ మహిళను గుర్తించి 100% ఏఎన్సీ రిజిస్ట్రేషన్ చేయాలని, ప్రతి గర్భిణీ మహిళ ఆరోగ్యాన్ని వైద్య శాఖ తరపున పక్కాగా ట్రాక్ చేయాలని, రెగ్యులర్ గా వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన మందులు పౌష్టికాహారం అందజేయాలని కలెక్టర్ తెలిపారు.

గర్భిణీ స్త్రీలకు టీకాలు సకాలంలో అందించాలని అన్నారు. ఆర్.బీ.ఎస్.కే సిబ్బందితో సమానం చేసుకుంటూ పీహెచ్సీ పరిధిలో పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, అంగన్ వాడి కేంద్రాలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న పిల్లల ఎదుగుదల పరిశీలించాలని అన్నారు. పీహెచ్సీ పరిధిలో పోషక లోపాలు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన పోషకాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆశా కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, తీసుకునే ఆహారం త్రాగునీరు పట్ల శ్రద్ధ వహించాలని ఆశా కార్యకర్తలు సూచించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పి.హెచ్.సి వైద్య అధికారి నెక్సీ క్రిస్టియానా, ఏఎన్ఎం లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News