నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు.
దిశ, గోదావరిఖని : నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గోదావరిఖని ఏసీపీ కార్యాలయంను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఏసీపీ కార్యాలయంకు చేరుకున్న పోలీస్ కమిషనర్ కు ఏసీపీ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ రికార్డులను పరిశీలించారు. దర్యాప్తు జరిగిన కేసుల ప్రస్తుత స్థితిగతులపై, గ్రేవ్ కేసుల్లో నిందితుల అరెస్టు, దర్యాప్తు జరుగుతున్న తీరును ఏసీపీ రమేష్ ను అడిగి తెలుసుకున్నారు.
పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులు, ఇతర కేసుల వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరిఖని సబ్`డివిజినల్ పోలీస్ అధికారులతో కమిషనర్ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. నేరం జరిగిన వెంటనే అధికారులు వేగంగా స్పందించాలని కోరారు. ఈ తనిఖీలో పెద్దపల్లి డీసీపీ చేతన, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, మంథని సీఐ రాజు పాల్గొన్నారు.