పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి : కోయ శ్రీహర్ష

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మంజూరు చేసిన అభివృద్ధి

Update: 2024-06-26 12:36 GMT

దిశ, గోదావరిఖని: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మంజూరు చేసిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రామగుండం మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రామగుండంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దుర్గయ్య పల్లి లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, గోదావరిఖని గాంధీ నగర్ లో ఉన్న ప్రభుత్వ హై స్కూల్ లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా సదరు పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ పెండింగ్ లో ఉన్న పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలల పెయింటింగ్ బృందాలు జిల్లాకు వచ్చేలోపు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మంజూరు చేసిన పనులను పూర్తి చేసి సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో కలెక్టర్ సంభాషిస్తూ, వారి విద్యా ప్రమాణాలు, చదివే, రాసే సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారి విద్యా ప్రమాణాలు పెంచాలని కలెక్టర్ సూచించారు.

పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులంతా తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఎక్కువ మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చే విధంగా చూడాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట మండల విద్యాశాఖ అధికారి రాజయ్య, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఎస్ ఇ చిన్నారావు, ఈ ఈ రామన్, ఏఈ పంచాయతీ రాజ్ జావిద్, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఏ.శారద, వాసవి, ఎస్.రేణుక, సిహెచ్ ఇజ్రాయిల్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్స్ జి రమాదేవి, డి శాంత, సిహెచ్ రాజేశ్వరి, లక్ష్మి, సంబంధిత పాఠశాలల, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News