అన్ని మతాల విశ్వాసాలను గౌరవించాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రాజ్యాంగాన్ని గౌరవించి రక్షించే పార్టీ బీఎస్పీ అని తెలంగాణ ఛీప్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
దిశ, హుజూరాబాద్: రాజ్యాంగాన్ని గౌరవించి రక్షించే పార్టీ బీఎస్పీ అని తెలంగాణ ఛీప్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్టికల్ 25 ప్రకారం.. అన్ని మతాల విశ్వాసాలను గౌరవించాలన్నారు. నాస్తికుల తో సహా ఎవరైనా ఏ మత విశ్వాసాలనైనా హేళన చేసి అగౌరవ పరచడం సమంజసం కాదన్నారు. హిందూ దేవుళ్లపై అవహేళన గా మాట్లాడిన బైరి నరేష్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే సమ్మక్క, సారలమ్మ వనదేవతలను ఘోరంగా హేళన చేసిన చిన్న జీయర్ స్వామి పై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బైరి నరేష్‌కు ఒక న్యాయం, చిన్న జీయర్ స్వామికి ఒక న్యాయం ఉండకూడదని.. చట్టం అందరికి సమానమేనన్నారు. అలాగే సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ , గరికపాటి లపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.