ప్రభుత్వ భూములు వాపస్..భూకబ్జా పై జిల్లా అధికార యంత్రాంగం ఫోకస్
జిల్లాలో కబ్జాకు గురైన ఆన్ సైన్డ్ భూములు తిరిగి వాపస్
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లాలో కబ్జాకు గురైన ఆన్ సైన్డ్ భూములు తిరిగి వాపస్ వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా వేల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యకాంతమైనట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్ మార్గదర్శనంలో జిల్లా అధికార యంత్రాంగం ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములపై ప్రత్యేక నజర్ పెట్టింది. కబ్జాకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపారు. భూ కబ్జా విషయంలో ‘దిశ’ తెలుగు దినపత్రిక వరుస కథనాలు ప్రచురించింది. ఈ క్రమంలో ప్రభుత్వ భూములను అక్రమ పట్టా చేసుకున్న వారిలో జంకు పుట్టింది. దీంతో కబ్జా చేసిన నేతలు ప్రభుత్వ భూములను తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రజాప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వారు కబ్జా చేసిన భూమిని తిరిగి అప్పగించారు. అంతేకాకుండా మరికొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు కూడా వీరి బాటలోనే కబ్జా చేసిన భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు తెలిసింది.
'దిశ' కథనాలతో కబ్జాదారుల్లో జంకు..
సిరిసిల్ల భూ కబ్జా విషయంలో ‘దిశ’ తెలుగు దినపత్రిక వరుస కథనాలను ప్రచురించింది. గత వారం రోజుల్లో ‘సిరిసిల్లలో భూ రాబంధులు’, ‘గులాబీ నేతల్లో గుబులు’, ‘బీఆర్ఎస్ నేతల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు’, ‘భూ కబ్జాదారుల అరెస్టుకు రంగం సిద్ధం’ ఇలా వరుస కథనాలను ప్రచురించింది. దీంతో తమ అరెస్ట్ కూడా తప్పదని జంకిన కబ్జాకు పాల్పడిన బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు తిరిగి ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అప్పగించేందుకు కలెక్టరేట్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో తంగళ్లపల్లి మండలానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు మిట్టపల్లి పద్మ 2ఎకరాలు, సురభి నవీన్ రావు 3ఎకరాలు, సురభి సురేందర్ రావు 3ఎకరాలు, సురభి సుధాకర్ రావు 5ఎకరాలు మొత్తం 11 ఎకరాల ప్రభుత్వ భూమిని సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్‌కు అప్పగించారు.
వీరి బాటలోనే మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు...
జిల్లా వ్యాప్తంగా సుమారు 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కాగా, ఒక్క తంగళ్లపల్లి మండలంలోనే సుమారు వెయ్యి ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వ అండతో మాజీ ప్రజాప్రతినిధులు గా వ్యవహరించిన బీఆర్ఎస్ నేతలు తమపై, తమ కుటుంబ సభ్యులపై ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టాలు చేయించుకున్నట్లు తేలింది. సిరిసిల్లలో అక్రమ భూ కబ్జాదారుల అరెస్టుల పర్వం కొనసాగుతున్న క్రమంలో కొంతమంది భూకబ్జాదారులు ప్రభుత్వం భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఇప్పటికే సుమారు 280 ఎకరాలకు పైగా కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి అప్పగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడిన తంగళ్లపల్లి మండలంలోని అంకుసాపూర్ గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులతో పాటు మరికొంతమంది మండల బీఆర్ఎస్ నేతలు వారు కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని తిరిగి అతి త్వరలో ప్రభుత్వానికి అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
ప్రభుత్వ భూమిని అప్పగిస్తే స్వాగతిస్తాం : సందీప్ కుమార్ ఝా, కలెక్టర్, సిరిసిల్ల
ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టాలు చేయించుకున్న వారిపై చర్యలు తీసుకుంటున్నాం. కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తే స్వాగతిస్తాం. ప్రభుత్వ భూమిని అక్రమ పట్టా పొందిన వారు స్వచ్ఛందంగా తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని కోరుతున్నాం. అలాగే అప్పగించిన భూములను పేదల సంక్షేమానికి వినియోగించడానికి కృషి చేస్తాం. మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ రెండెకరాల భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించడం అభినందనీయం. అలాగే 2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ, రైతుబంధు మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ది పొందివుంటే, ఆ సొమ్ము రికవరీ కోసం డిమాండ్ నోటీసు జారీ చేస్తాం.