అధికారులు గప్ చుప్.. పద్మనాయక ఫంక్షన్ హాల్ పేపర్లు రెడీ

ఆబాది భూమి ఆక్రమించుకోవడంతో పాటు పద్మనాయక ఫంక్షన్

Update: 2025-01-03 02:13 GMT

దిశ బ్యూరో, కరీంనగర్ : ఆబాది భూమి ఆక్రమించుకోవడంతో పాటు పద్మనాయక ఫంక్షన్ హాల్ నిర్వాహకులు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ విషయంలో అధికారులు నోరు మెదపక పోవడంతో అలుసుగా భావించి మరో అడుగు ముందుకేసి తర్జుమా పేరుతో తమాషాకు తెరలేపారు. పద్మనాయక సొసైటీ సభ్యులు పద్మనాయక హాస్టల్ భవన సముదాయానికి భూమి పత్రాలు ఉన్నాయా! పద్మనాయక నిర్మాణాలు పర్మిషన్ తీసుకునే నిర్మించామా? అంటూ ప్రశ్నించడంతో ఇరకాటంలో పడ్డారు. అయితే సొసైటీ నాయకులు పత్రాల కోసం మీరు పరేషాన్ కావాల్సిన అవసరం లేదు. మన వద్ద పత్రాలు ఉన్నాయి..! కానీ అవి ఉర్దూ భాషలో ఉన్నాయి. వాటిని తెలుగులోకి అనువాదించి అందిస్తామంటు సభ్యులకు భరోసా కలిగిస్తున్నారు. అయితే వాటికి పర్మిషన్ మాత్రం లేదు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్‌లో మనమే పాలకులం కదా! మనల్ని అడిగే వారు ఎవరు? అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుండగా ఈ విషయమై సర్వత్రా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

భూమి పత్రాలపై సందేహాలు...

పద్మనాయక సొసైటీ అక్రమ బండారం బహిర్గతం కావడంతో సొసైటీ సభ్యులనుంచి నాయకులపై ఒత్తిడి పెరిగింది. పద్మనాయక సొసైటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పలువురు సభ్యులు నాయకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. పద్మనాయక భూమి పత్రాలు ఉన్నాయా? పర్మిషన్ ఉందా అంటు నాయకులను నిలదీశారు. సభ్యుల సందేహాలకు తలలు పట్టుకున్న నాయకులు పర్మిషన్ పై మనల్ని అడిగేవారు ఎవరంటు? ధీమా వ్యక్తం చేస్తూ! పత్రాలు ఉన్నాయని, అవి ఉర్థూ భాషలో రాసి ఉన్నాయని తెలపడం గమానార్హం. అయితే వాటిని తెలుగులోకి తర్జుమా చేసి చూపిస్తామంటూ భరోసా కల్పించడం పద్మనాయక సొసైటీ సభ్యులకు అంతుచిక్కడం లేదు. నిన్నా మొన్నటి వరకు పత్రాల కోసం పరేషానై ఆఫీసుల చుట్టూ తిరిగిన పద్మనాయక నిర్వాహకులు ఇప్పుడు పత్రాలు ఉన్నాయంటు గాంభీర్యం వ్యక్తం చేయడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

భూమి పత్రాలు ఉంటే పొజిషన్ సర్టిఫికెట్ ఎందుకు..?

భూమి పత్రాలు ఉన్నాయంటు కొత్త నాటకానికి తెరలేపిన పద్మనాయక హాస్టల్ నిర్వాహకులు. గతంలో పొజిషన్ సర్టిఫికేట్ కోసం ఎందుకు వెంపర్లాడారనేది సభ్యులకు అంతుచిక్కని ప్రశ్న..! పొజిషన్ సర్టిఫికెట్ కోసం అధికారులకు అర్జీ పెట్టుకున్న సందర్బంలో సదరు భూమి మా ఆధీనంలో ఉంది! గత కొద్ది సంవత్సరాలుగా అందులో మేము ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నామని, నిర్మాణాలు చేపట్టామంటూ నాయకులు ఆర్డీలో పేర్కొన్నారు. అందుకున అప్పుడు అధికారులు అడిగిన ధృవపత్రాలు ఎందుకు సమర్పించలేదనేది బహిరంగ రహస్యమే! సాక్ష్యాత్తు అధికారులు మేము జారీ చేయలేమంటూ ముక్కు సూటిగా చెప్పినప్పటికి! అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం లోని పెద్దల చేత ఒత్తిడి పెంచి నామ మాత్రపు పొజిషన్ సర్టిఫికెట్ పద్మనాయక నిర్వాహకులు తీసుకున్నా. వారి వద్ద పత్రాలు ఉండగా పొజిషన్ సర్టిఫికెట్ కోసం అంతగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏంటనేది ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్న ప్రశ్న..!

పర్మిషన్ లేక పోయినా నిర్మాణాలు..?

కరీంనగర్ జిల్లా కేంద్రం, పట్టణం నడిబొడ్డున మున్సిపల్ ఆఫీస్ కు కూతవేటు దూరంలో పర్మిషన్ లేకుండా నిర్మాణం జరుగుతుంటే చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పర్మిషన్ లేకపోయినా కమర్షియల్ కట్టడాలు చేపట్టి ఆక్రమణ చేసి నిర్మాణాలు చేపట్టారని తేటతెల్లమైనా ఇప్పటికీ పాలకులు కానీ, అధికారులు కానీ అటు వైపు చూడకపోవడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణ కోసం రూ.కోట్లు చేతులు మారినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పద్మనాయక ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ స్పందించి నప్పటికీ చర్యలు ఉండకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు పద్మనాయక సొసైటీ నాయకులు ఇచ్చిన అమ్యామ్యాలకు తలొగ్గి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మా వద్ద రికార్డు లేదు వారికి నోటీసులు ఇచ్చాం : వేణు, ఏసీపీ టౌన్ ప్లానింగ్, కరీంనగర్

పద్మనాయక హాస్టల్, ఫంక్షణ్ హాల్‌కు పర్మిషన్ ఉన్నట్టు మా దగ్గర ఎలాంటి రికార్డులు లేవు. పద్మనాయక నిర్వాహకులకు నోటీసులు ఇచ్చాం. వారి వద్ద ఏమి ఉన్నాయో మాకు సమర్పించాలని తెలిపాం. ఇప్పటివరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. తదుపరి చర్యలకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.


Similar News