ఎమ్మెల్యే రవిశంకర్ కు నిరసన సెగ
చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండలంలో ప్రచారం చేయడానికి వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రవిశంకర్ కు నిరసన సెగ తగిలింది.
దిశ, జగిత్యాల ప్రతినిధి : చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండలంలో ప్రచారం చేయడానికి వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రవిశంకర్ కు నిరసన సెగ తగిలింది. మండలంలోని డబ్బు తిమ్మాయపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో స్థానిక రైతులు అడ్డుకున్నారు. తమ నాలుగు గ్రామాలకు సాగునీరు అందించే కాలువ పనులు ఐదేండ్లు గడుస్తున్నా ఇంకా ప్రారంభించడం లేదని సాగు నీరు ఇస్తారా లేక ఉరి వేసుకుని చావమంటారా అని ఎమ్మెల్యే రవి శంకర్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు.
నిరసన తెలుపుతున్న సమయంలో రైతులకు, స్థానిక బీఆర్ఎస్ నాయకులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చ చెప్పారు. అయితే రవి శంకర్ మాట్లాడుతూ మీ అందరికీ దండం పెడతా నేను చెప్పేది వినండి.. నేను ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల్లో కాలువ పనులు ప్రారంభిస్తానంటూ హామీ ఇచ్చారు.