ప్రవీణ్ సింగ్ హత్య కేసును చేధించిన పోలీసులు.. మిత్రుడి భార్యను వేధిస్తున్నందుకు..
మిత్రుడి భార్యను లైంగికంగా వేధిస్తున్నాడనే కారణంతో కోరుట్ల పట్టణానికి చెందిన ఠాకూర్ ప్రవీణ్ సింగ్‌ను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
దిశ, కోరుట్ల టౌన్: మిత్రుడి భార్యను లైంగికంగా వేధిస్తున్నాడనే కారణంతో కోరుట్ల పట్టణానికి చెందిన ఠాకూర్ ప్రవీణ్ సింగ్‌ను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు పాల్పడిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హత్యకు సంబంధించిన వివరాలను మెట్‌పల్లి డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి వెల్లడించారు. పట్టణంలోని నివాసం ఉంటున్న జగదీశ్వర్ భార్యను ప్రవీణ్ సింగ్ లైంగికంగా వేధిస్తున్నాడనే అనుమానంతో జగదీశ్వర్ స్నేహితులు హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. జగదీశ్వర్ స్నేహితులు పోతువంచ రాహుల్, పోగుల రాజేష్, ఓరుగంటి వెంకటేష్, బోయిని కళ్యాణ్ అలియాస్ మంచోడు, గుమ్మడి శశిలు ఈ నెల 16న ఆదివారం రాత్రి ఐలాపూర్ దర్వాజా సమీపంలో ప్రవీణ్ సింగ్‌ను బండరాళ్లు, బీరు బాటిళ్లతో విచక్షణ రహితంగా కొట్టినట్లు తెలిపారు.
ఈ ఘటనలో ప్రవీణ్ సింగ్ తీవ్ర గాయపడి అపస్మారక స్థితికి చేరుకోగా.. ప్రవీణ్ సింగ్ మరణించాడని నిందితులు అక్కడి నుండి పారిపోయారని పోలీసులు తెలిపారు. అతని పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించగా.. సోమవారం 17న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పేర్కొన్నారు. ప్రవీణ్ సింగ్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. హత్యకు పాల్పడిన నిందితులను బుధవారం రోజు ఎకీనపుర్ గ్రామా శివానేలో పట్టుకున్నట్లు తెలిపారు. హత్య ప్రమేయం ఉన్న కొందరు పరారీలో ఉన్నారని, వారిని తొందర్లోనే పట్టుకుంటామన్నారు. పట్టుకున్న వారి వద్ద నుండి 5 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన కోరుట్ల ఎస్సై చిర్ర సతీష్, సిబ్బంది సత్తయ్య, ఎల్లయ్య లను డిఎస్పీ రవీందర్ రెడ్డి, సిఐ ప్రవీణ్ అభినందించారు.