Dasara 2024: దసరా రష్.. బస్సులో ఊపిరాడక ఇద్దరు యువతులు..

దసరా సెలవులు రావడంతో సొంతూళ్లకు వెళ్లేవారితో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. పరిమితికి మించి బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో.. లోపల ఊపిరాడక ఇద్దరు యువతులు స్పృహతప్పి పడిపోయారు.

Update: 2024-10-02 07:20 GMT

దిశ, వెబ్ డెస్క్: దసరా సందడి మొదలైంది. దసరా వచ్చిందయ్యా.. సరదా తెచ్చిందయ్యా అని అనుకోవడం కంటే.. సరదా తీర్చేసిందని చెప్పాలి. ఏడాది పొడవునా ఎన్ని పండుగలొచ్చినా ఒకట్రెండు రోజులే విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయి. కానీ.. దసరా పండుగకు మాత్రం 10 రోజులు సెలవులు ఉంటాయి. దీంతో కుటుంబాలన్నీ పండుగ జరుపుకునేందుకు సొంతూళ్లకు బయల్దేరుతాయి. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా.. పండుగకి మాత్రం సొంతూర్లో ఉండాలన్నదే టార్గెట్.

అందుకే పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ఇటు ఆర్టీసీ, అటు రైల్వే శాఖలు అదనపు సర్వీసులను అందుబాటులో ఉంచాయి. అయినా సరే అవి ఏమాత్రం సరిపోవడం లేదు. 50 మంది ప్రయాణికులు వెళ్లాల్సిన బస్సులో 100-150 మంది ప్రయాణిస్తున్నారు. బస్సులో చోటు లేకపోయినా.. కిక్కిరిసి మరీ వెళ్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బస్సుల్లో ప్రయాణించేవారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో.. ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.

జగిత్యాల - దావన్ పల్లి మార్గంలో ఒకే ఒక్క బస్సు ఉండటంతో.. ఎంతమంది ప్రయాణికులైనా అందులోనే వెళ్లాల్సిన పరిస్థితి. సొంతూరికి వెళ్లేందుకు బస్సెక్కిన వారికి.. బస్సులో ఊపిరి అందడం లేదు. నిలబడిన వారికే కాదు.. కూర్చుని ఉన్నవారిదీ అదే పరిస్థితి. పరిమితికి మించి ప్రయాణికులు బస్సెక్కడంతో లోపల ఊపిరాడటం లేదని వాపోతున్నారు. తాజాగా ఈ బస్సులో ఎక్కిన ఇద్దరు యువతులు ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయారు. వారికి వెంటనే ప్రాథమిక చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. అధికారులు ఇకనైనా మేల్కొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా.. రద్దీకి తగ్గట్టుగా బస్సు సర్వీసులను పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. 


Similar News