పంచాయతీలు అస్తవ్యస్తం.. ఆరు నెలలుగా కేంద్రం, మూడేళ్లుగా రాష్ట్ర నిధులు బంద్

సార్.. మా గ్రామ పంచాయతీకి ఆరు నెలలుగా కేంద్రం నుంచి, మూడేళ్లుగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు.

Update: 2024-07-09 02:02 GMT

గ్రామపంచాయతీలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో పాలన గాడి తప్పింది. నిధులు లేక నిర్వహణ లోపించింది. సకాలంలో వేతనాలు అందక పోవడంతో పారిశుధ్య కార్మికులు, గ్రామపంచాయతీ పారిశుధ్యాన్ని పట్టించుకోక కూలీ పనులకు వెళ్తున్నారు. దీంతో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ట్రాక్టర్‌కు డీజిల్ లేకపోవడంతోపాటు కిస్తీల చెల్లింపు పంచాయతీలకు భారంగా మారింది. సర్పంచ్‌లు లేకపోవడం ప్రత్యేక అధికారులు పట్టించుకోకపోవడంతో అన్ని తామై పాలన సాగిస్తున్న పంచాయతీ కార్యదర్శులపై ఆర్థిక భారం పడుతోంది. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. సుమారు నాలుగు నెలలుగా పంచాయతీల్లో అధికారుల పాలనే నడుస్తోంది. మరోవైపు పదవిలో ఉన్నప్పుడు అప్పులు తెచ్చి చేసిన పనులకు బిల్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వెంటనే వాటిని చెల్లించాలని తాజా మాజీ సర్పంచ్‌లు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అంతేగాక పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

దిశ, హుజూరాబాద్ రూరల్ : గ్రామపంచాయతీలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో పాలన గాడి తప్పింది. సకాలంలో వేతనాలు అందక పోవడంతో పారిశుధ్య కార్మికులు, గ్రామపంచాయతీ పారిశుధ్యాన్ని పట్టించుకోక కూలీ పనులకు వెళ్తున్నారు. దీంతో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ట్రాక్టర్‌కు డీజిల్ లేకపోవడంతోపాటు కిస్తీల చెల్లింపు పంచాయతీలకు భారంగా మారింది. సుమారు నాలుగు నెలలుగా పంచాయతీల్లో అధికారుల పాలనే నడుస్తోంది. మరోవైపు పదవిలో ఉన్నప్పుడు అప్పులు తెచ్చి చేసిన పనులకు బిల్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వెంటనే వాటిని చెల్లించాలని తాజా మాజీ సర్పంచ్‌లు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అంతేగాక ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

చిన్న గ్రామపంచాయతీలకు భారం...

పారిశుధ్య నిర్వహణకు గత ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లకు రుణ చెల్లింపు చిన్న గ్రామపంచాయతీలకు మోయలేని భారంగా మారింది. చిన్న గ్రామపంచాయతీలకు ఆదాయ మార్గాలు లేక బ్యాంకులకు ట్రాక్టర్ కిస్తీలు చెల్లించలేని దయానీయ స్థితి దాపురించింది. ఇక పారిశుధ్య కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించలేని దుర్భర పరిస్థితి ఉంది. జిల్లాలో 313 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో చిన్న గ్రామపంచాయతీలు 150వరకు ఉంటాయి. ప్రతి పల్లెలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో గత ప్రభుత్వం ట్రాక్టర్లను మంజూరు చేసింది. వీటి నిర్వహణ బాధ్యత గ్రామపంచాయతీలకు అప్పగించింది. ప్రతినెల ట్రాక్టర్ల కొనుగోలు కిస్తీలు, డిజిల్, మరమ్మతులు, పారిశుధ్య కార్మికుల వేతనాలకు చిన్న గ్రామ పంచాయతీలకు వచ్చే నిధుల్లో ఎక్కువ శాతం వీటికి ఖర్చు అవుతున్నాయి.

విద్యుత్ బిల్లుల మోత అదనంగా భారమవుతుంది. చిన్న పంచాయతీల్లో వసూలయ్యే ఏడాది ఇంటి పన్ను రెండు మూడు నెలల ట్రాక్టర్ కిస్తీలకు సరిపోవడం లేదని పంచాయతీ కార్యదర్శుల ఆవేదన చెందుతున్నారు. తాగునీటికి మిషన్ భగీరథ రావడంతో నీటి పనులను పూర్తిగా రద్దు చేశారు. ప్రభుత్వం ఇచ్చే పల్లె ప్రగతి నిధులే దిక్కుగా గ్రామపంచాయతీకి మారుతున్నాయి. పంచాయతీలకు గరిష్టంగా వచ్చే నిధులు ఏడాదికి రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఉంటుంది. వాటిల్లో ట్రాక్టర్ కిస్తీలు, మరమ్మతులు, డీజిల్, విద్యుత్ బిల్లులు, పారిశుధ్య కార్మికుల వేతనాల కోసం ఏటా రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుంది. వచ్చే నిధులన్ని వీటికి ఖర్చు అయితే అభివృద్ధి పనులు ఎలా చేయాలని కార్యదర్శులు వాపోతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామపంచాయతీలకు రావాల్సిన నిధులు మూడేళ్లుగా రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు నెలలుగా నిధులు రాకపోవడంతో పల్లెల పాలన గాడి తప్పింది. కార్యదర్శిలే సొంత డబ్బు వెచ్చించి పంచాయతీలను నెట్టుకొస్తున్నారు. ఇలా చిన్న పంచాయతీల్లో వచ్చే నిధులకు, ఖర్చులకు పొంతన ఉండడం లేదు. వచ్చే నిధులు ఏ మూలకు సరిపోవడం లేదు. వీటితోపాటు పంచాయితీల్లో చిన్నపాటి సమస్యల పరిష్కారానికి సైతం డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి జిల్లాలోని అన్ని చిన్న గ్రామపంచాయతీలో ఉంది.

సమస్యను ప్రభుత్వానికి తెలుపుతున్నాం..

చిన్న గ్రామపంచాయతీల్లో ఎదురవుతున్న సమస్యలు చాలా ఉన్నాయి. పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. కొన్ని పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు ద్వారా వచ్చిన నిధులను సమన్వయం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. జనరల్ ఫండ్‌ను వినియోగించి కొన్ని సమస్యలను పరిష్కరిస్తున్నాం.

- సురేందర్, మండల పంచాయతీ అధికారి, హుజూరాబాద్


Similar News