SP Ashok Kumar : శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే రౌడీ షీట్లు ఓపెన్

శాంతిభద్రతలకు భంగం కలిగించిన వ్యక్తుల పై రౌడీ షీట్లు ఓపెన్

Update: 2024-10-28 15:52 GMT

దిశ, జగిత్యాల టౌన్: శాంతి భద్రతలకు భంగం కలిగించిన వ్యక్తుల పై రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లా పోలీసు ఆఫీస్ లో నిర్వహించిన క్రైమ్ మీటింగ్ లో ఎస్పీ మాట్లాడుతూ, నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడం తో పాటు చాలా రోజుల నుండి పెండింగ్ లో ఉన్న కేసుల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఇప్పటి వరకు నమోదైన కేసుల లో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులకు వివరించారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్టంగా చేయడం తో పాటు ప్రతి సర్కిల్ లో ఒక స్పెషల్ టీం ను నియమించి వాటి నివారణకు కృషి చేయాలన్నారు.

ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితుల పై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలు పరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు. వివిధ నేరాల్లో నిందితులుగా ఉండి షీట్లు తెరువబడిన నేరచరితులు విధిగా పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని లేని పక్షంలో వారిని బైండోవర్ చేయాలని అన్నారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని, గుట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట, గుడుంబా, పీడీఎస్ రైస్, వాటిపై నిఘా ఉంచి దాడులు నిర్వహించి, అరెస్ట్ చేయాలని సూచించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశం లో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు , డిఎస్పి లు రవీంద్ర కుమార్, రఘు చందర్, ఉమా మహేశ్వర రావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Similar News