రైతులను ఆదుకోవాల్సిన సమయంలో ఆర్భాటాలా : పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన సమయంలో ఆర్భాటాలా అని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Update: 2023-04-26 13:13 GMT

దిశ, సారంగాపూర్: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన సమయంలో ఆర్భాటాలా అని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని బట్టపల్లి గ్రామంలో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన తూకం వేయడం మొదలు పెట్టలేదన్నారు. తేమ శాతం వచ్చిన రైతుల ధాన్యం కూడా తూకం వేయకపోవడం తో అకాల వర్షాలకు వారి ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

వెంటనే ధాన్యం తూకం వేయడం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన సమయంలో బీఆర్ఎస్ నాయకులు పార్టీ సమావేశాల ఆర్భాటాలు చేయడం ఎంత వరకు సమంజసం అని దానికి తోడు అధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే యాసంగి పంట మొదలైనప్పటి నుంచి చీడ, పీడ పురుగులతో దిగుబడి తగ్గిందని సమయానుకూలంగా ధాన్యం తూకం వేయకపోవడంతో రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తూకం విషయంలో జిల్లా అధికారులతో మాట్లాడితే తూకం వేస్తామని చెప్పడమే తప్పా.. పనులు ప్రారంభించిన దాఖలు లేవన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు కల్పించిన రాయితీలు అన్నింటినీ ఎత్తివేసి రైతుబంధు ఇస్తున్నామనడం ఎంత వరకు సమంజసమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన రాయితీలను కొనసాగిస్తూనే రైతుబంధు కూడా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎనమిదేళ్లుగా రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయకపోవడంతో రైతులకు నష్టపోయిన పంటకు నష్ట పరిహారం అందడం లేదన్నారు. ఇప్పటికైనా బీమా పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News