ఒకే ఒక్కడు.. 72 దొంగతనాలు: పోలీసుల అదుపులో నిందితుడు
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను రామగుండం కమిషరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే వ్యక్తి వివిధ ప్రాంతాల్లో 72 దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
దిశ, పెద్దపల్లి: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను రామగుండం కమిషరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే వ్యక్తి వివిధ ప్రాంతాల్లో 72 దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. దొంగతనానికి ఉపయోగించినా నాలుగు మోటర్ సైకిల్స్, ఒక కారు, ట్రాలీ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో గురువారం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి వివరాలను మీడియాకు వెల్లడించారు. 2023 నుంచి 'ప్రివెంటివ్ పోలీసింగ్'పై ఫోకస్ చేస్తూ నేరాల నియంత్రణ కు పోలీసులు అనేక రకాల ప్లాన్లు వేసి అమలు చేస్తేన్నారని తెలిపారు.
ఇందులో భాగంగానే పోలీసు అధికారులు, క్రైమ్ డిటెక్షన్ బృందాలు క్రిమినల్ డేటాబేస్‌ను అప్‌డేట్ చేయడంతో పాటు వారి కదలికలపై నిఘా ఉంచినట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ఎస్.ఐ రవికుమార్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రాయల్ టాకీస్ చౌరస్తా నిందితుడిని గమనించినట్లు వివరించారు. అప్రమత్తమైన నిందితుడు అనుమానాస్పద స్థితిలో ద్విచక్ర వాహనంపై పారిపోయేందుకు ప్రయత్నించగా అతడని పట్టుకొని పట్టుకొని తమదైన స్టైల్ లో విచారించగా చేసిన అన్ని నేరాలను ఒప్పుకున్నట్లు సీపీ వివరించారు.
ఆంధ్రా నుంచి తెలంగాణకు..
రాజవరపు వెంకటేశ్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా సిర్కే కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరుకు చెందిన వెంకటేశ్ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ చెందిన ఒక అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకొని ఇక్కడే నివాసం ఉంటున్నాడు. 2019లో మొదటగా చోరీకి పాల్పడ్డాడు. నిందితుడు మద్యానికి బానిసగా మారి, ఆన్‌లైన్ బెట్టింగ్ పాల్పడుతూ చెడు వ్యసనాలకి అలవాటు పడి జల్సాల కోసం దొంగతనం చేసేందుకు అలవాటు పడ్డాడు.
అదేవిధంగా.. దొంగిలించిన ఆభరణాలు ముత్తూట్ మరియు శ్రీరామ్ ఫైనాన్స్ లలో కొంత మేర తాకట్టు పెట్టినట్లు సీపీ వివరించారు. కొంత సొత్తు అమ్మగా వచ్చిన డబ్బులతో మణుగూరులో ఒక ఇంటిని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మూడు బ్యాంకు అకౌంట్లలో రూ.కోటి వరకు అన్ లైన్ బెట్టింగ్ లలో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
10 పోలీస్ స్టేషన్లు.. 72 దొంగతనాలు..
రామగుండం కమిషరేట్ పరిధిలోని నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు దొంగతనాలు, లక్సెట్టిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు దొంగతనాలు, చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు, మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో 11, రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17, కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు, గోదావరి ఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14, భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు దొంగతనాలు చేసినట్లు సీపీ రెమా రాజేశ్వరి తెలిపారు. మొత్తం72 కేసుల్లో దొంగిలించిన సొత్తు 2.89 కిలో బంగారం, 4.07 కిలోల వెండి, రూ.19 లక్షలు నగదుతో పాటు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు.