దేశంలోనే KCR అంతటి అసమర్థ CM మరొకరు లేరు: MLC జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దేశంలో కేసీఆర్ అంతటి అసమర్థ సీఎం మరొకరు ఉండరని.. తెలంగాణ ప్రజల హక్కులని కేసీఆర్ కాలరాస్తున్నాడని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, జగిత్యాల ప్రతినిధి: దేశంలో కేసీఆర్ అంతటి అసమర్థ సీఎం మరొకరు ఉండరని.. తెలంగాణ ప్రజల హక్కులని కేసీఆర్ కాలరాస్తున్నాడని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందో ఆ హక్కుల పరిరక్షణకు మరో దశ ఉద్యమం ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తే కేంద్రంలో ఉన్న మోడీని ఎదిరించే ధైర్యం లేకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానికంగా నిరసనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
అధికార పార్టీ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ హక్కుల పరిరక్షణకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టాలని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పేరు చెప్పి రైతులకు ఇచ్చే రాయితీలు అన్నింటిని ఎత్తివేసిందని.. కేసీఆర్ ప్రభుత్వానికి రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన రాయితీలు అమలు చేస్తూనే రైతుబంధు కొనసాగించాలని డిమాండ్ చేశారు. 2020 వరకు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్ని చట్టాలను సమర్ధించిన సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం చేయాలని ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు అని నిలదీశారు.
మరోవైపు కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి రావాల్సిన వాటా దోపిడీకి గురవుతున్నా.. కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు. నాడు కాంగ్రెస్ పాలనలో గ్రామీణ నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకే ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చామని.. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేశామని.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 14 గంటల విద్యుత్ ఇస్తూ 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.