కాంగ్రెస్ అధికారంలోకి రావడం అత్యంత ఆవశ్యకం.. MLC Jeevan Reddy
ప్రజా సంక్షేమం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు
దిశ, జగిత్యాల ప్రతినిధి: ప్రజా సంక్షేమం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అత్యంత ఆవశ్యకమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో అభియాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వరి ధాన్యం క్వింటాల్ కి 500 నుండి 1,350కి పెంచిందని, రాబోయే కాలంలో ఆ మొత్తాన్ని 2500 కి పెంచుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలను కార్యకర్తలు గడప గడపకు తీసుకెళ్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాబోయే కాలంలో పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. తెలంగాణ ఐక్యత కోసం అందరం పోరాటం చేయాలని అందుకోసం ప్రతి ఒకరు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. దేశంలోని అన్ని మతాలను ఐక్యం చేసేందుకు నిరుపేదలకు అండగా నిలిచేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం దేశంలో మత విద్వేషాలు సృష్టిస్తోందని మండిపడ్డారు.
రైతు బంధు పేరిట రైతులకు ఇవ్వాల్సిన రాయితీలను అన్నింటినీ ఎత్తేసి నాలుగేళ్లు గడుస్తున్నా రుణ మాఫీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది అని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రాయితీలను ఇస్తూ రైతు బంధు కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వైఫల్యం వల్లనే ఖమ్మంలోని ఏడు మండలాలను , సీలేరు ప్రాజెక్ట్ ను ఆంధ్రకు అప్పనంగా కట్టబెట్టారు అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ రైతు బంధు,పెన్షన్ ల మీద, బీజేపీ మతం మీద ఆధారపడితే కాంగ్రెస్ పార్టీ గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాల మీద ఆధారపడింది అని ఆవే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయి అని పార్టీ కోసం కష్ట పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు తగిన గుర్తింపు ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్, పి సి సి సభ్యులు గిరి నాగభూషణం, నాయకులు గాజెంగి నందయ్య, బండ శంకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కండ్లపెల్లి దుర్గయ్య, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సత్యం రెడ్డి, గుండా మధు,మసర్తి రమేష్, ధర రమేష్ బాబు, తాటిపర్తి దేవేందర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి, బుర్ర రాములు గౌడ్, సత్యనారయణ రెడ్డి, మన్సూర్, గంగా రెడ్డి, తాజొద్దిన్ తదితరులు పాల్గొన్నారు.