మాస్టర్ ప్లాన్‌ను పూర్తిస్థాయిలో సవరిస్తాం.. మంత్రి కీలక ప్రకటన
జగిత్యాల మున్సిపల్‌కు సంబందించి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను పూర్తిస్థాయిలో సవరించి.. రైతులకు, ప్రజలకు కొంచెం కూడా నష్టం లేకుండా చూస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల మున్సిపల్‌కు సంబందించి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను పూర్తిస్థాయిలో సవరించి.. రైతులకు, ప్రజలకు కొంచెం కూడా నష్టం లేకుండా చూస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కొద్ది రోజులుగా జగిత్యాల మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ విషయంలో జగిత్యాల పట్టణ శివారులోని రైతులు ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌తో కలిసి గురువారం సాయంత్రం పత్రిక ప్రకటన జారీ చేశారు. డ్రాఫ్ట్‌లో దొర్లిన తప్పులతో రైతులు కొద్దిరోజులుగా నిరసనలు తెలియజేస్తున్నారని.. వారి ఆవేదన తమకు అర్థమైందన్నారు. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి.. ప్రస్తుతం ప్రకటించిన మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‍ను పూర్తి స్థాయిలో సవరిస్తామన్నారు.
ప్రైవేట్ వ్యక్తులు, రైతుల భూముల్లో చూపించిన జోన్లను ప్రభుత్వ భూముల్లోకి మార్చుతామన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ తో పాటు, శివారు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నామని, ఆ ప్రభుత్వ భూముల్లోకి ఇండస్ట్రియల్, పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్, రిక్రియేషన్ తదితర జోన్లను తరలిస్తామన్నారు. ప్రస్తుతం ప్రకటించిన డ్రాఫ్ట్‌ను పూర్తిగా సవరించి, కొత్త డ్రాఫ్ట్‍ను రూపొందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జగిత్యాలతో పాటు, శివారు గ్రామాల రైతులు మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ విషయంలో అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు తమ భూమిలో ఒక గుంట భూమిని కూడా నష్టపోకుండా చూసే బాధ్యత తమదేనన్నారు. రైతులు ఆందోళనలను విరమించాలని ఆయన కోరారు.