నేను ముక్కు నేలకు రాస్తాను.. జీవన్ రెడ్డి నువ్వు రాస్తావా : మంత్రి కొప్పుల
నేను జగిత్యాల చౌరస్తాలో ముక్కు భూమికి రాస్తా జీవన్ రెడ్డి నువ్వు రాస్తావా ? అంటూ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సవాల్ విసిరారు.
దిశ, జగిత్యాల ప్రతినిధి : నేను జగిత్యాల చౌరస్తాలో ముక్కు భూమికి రాస్తా జీవన్ రెడ్డి నువ్వు రాస్తావా ? అంటూ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సవాల్ విసిరారు. జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అంబులెన్స్ సర్వీస్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే మూడు కోట్ల లీటర్ల విషపు నీరు వస్తుందని అసత్య ప్రచారాలు చేస్తూ జీవన్ రెడ్డి ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఎలాంటి విషపు నీరు రాదని ఓ వైపు నిపుణులు చెబుతుంటే రాజకీయాల కోసం జీవన్ రెడ్డి ఇలా మాట్లాడడం సబబు కాదన్నారు.
ఫ్యాక్టరీ నుండి ఒక్క చుక్క విషపు నీరు రాదని తాను ముక్కు నేలకు రాస్తానని జీవన్ రెడ్డి ముక్కు నేలకు రాస్తాడా అని ప్రశ్నించాడు. మరోవైపు నిజం షుగర్ ఫ్యాక్టరీ విషయాన్నీ జీవన్ రెడ్డి కావాలని రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. చెరకు రైతులు అందరూ వరి సాగు చేస్తున్నారని తెలిపారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాం లేకపోతే లేదు అని అన్నారు. పొలిటికల్ రిటర్మెంట్ కి వస్తున్నారు స్వార్థం కోసం సమాజానికి చేటు చేయొద్దని ఇది రాజనీతి కాదు అని హితవు పలికారు. అయితే మంత్రి కొప్పుల వ్యాఖ్యలు ప్రస్తుతం జగిత్యాలలో హాట్ టాపిక్ గా మారాయి.