Minister Bandi Sanjay : ఆర్మీ జవాన్లు మన దేశానికి రియల్ హీరోస్
విద్యార్థులు ఆర్మీ, నేవీ,ఎయిర్ ఫోర్స్ వంటి ఉద్యోగాల కోసం
దిశ,కరీంనగర్ రూరల్: విద్యార్థులు ఆర్మీ, నేవీ,ఎయిర్ ఫోర్స్ వంటి ఉద్యోగాల కోసం డిఫెన్స్ రంగాన్ని ఎంచుకోవడం చాలా గర్వంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.ఆదివారం కరీంనగర్ రేకుర్తిలోని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ, జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో పని చేయడమంటే దేశానికి సేవ చేయడమే నన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలు పెంచుతూ క్రమశిక్షణను అలవర్చుతూ అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్న ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడేళ్లలో ఈ అకాడమీ నుంచి దాదాపు రెండు వేల మంది విద్యార్థులు ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు ఎంపికయ్యారంటే ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. ఎంతో నిబద్దతతో, పట్టుదలతో శిక్షణనిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఢిల్లీ ఢిఫెన్స్ అకాడమీ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే డిఫెన్స్ ఉద్యోగాలు సాధించాలనే తపనతో చిన్న వయసులోనే డిఫెన్స్ శిక్షణ అకాడమీలో చేరి పట్టుదలతో శ్రమిస్తున్న విద్యార్థులందరికి అన్నగా ఆశీర్వదిస్తున్న అన్నారు. దేశం కోసం సేవ చేయాలని మిమ్మల్ని ఇక్కడికి పంపిన మీ తల్లిదండ్రులు నిజమైన దేశభక్తులన్నారు. జవాన్ కావాలని కలలుకంటున్న మీరంతా శిక్షణను పూర్తి చేసి లక్ష్యాన్ని సాధించాలే..తప్ప మధ్యలో పారిపోకుండా మీ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ఆయన కోరారు. అనంతరం అకాడమీ చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకుని డిఫెన్స్ రంగంలో ఉద్యోగాలు సాధించాలన్నారు. మొదటి సంవత్సరం లో జాయిన్ అయిన విద్యార్థులు సీనియర్ విద్యార్ధులను ఆదర్శంగా తీసుకుని చదువులో పోటీ పడలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రధానంగా విద్యార్థినిలు జవాన్ వేషధారణలో విన్యాసాలు చేస్తూ జాతీయ జెండాతో దేశ భక్తిని చాటుకున్నారు.