ట్రాన్స్ జెండర్ల జీవనోపాధి రుణ సదుపాయాలు: మంత్రి కేటీఆర్
బంగారు తెలంగాణ లో వివక్షకు ఎలాంటి తావు లేకుండా ట్రాన్స్ జెండర్ల గుర్తింపు, జీవనోపాధి కోసం ప్రత్యేకంగా రుణ సదుపాయాలు కల్పిస్తున్నట్లు పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: బంగారు తెలంగాణ లో వివక్షకు ఎలాంటి తావు లేకుండా ట్రాన్స్ జెండర్ల గుర్తింపు, జీవనోపాధి కోసం ప్రత్యేకంగా రుణ సదుపాయాలు కల్పిస్తున్నట్లు పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్లతో సమావేశమై వారి బాగోగులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి పట్ల ఉన్న వివక్షను పోగొట్టేందుకు, వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు వారికి సాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
దళితబంధు మాదిరిగానే గుర్తింపు కార్డులు పొందిన ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వారు నిర్భయంగా జీవించేందుకు అసాంఘిక శక్తుల చేతిలో కీలుబొమ్మలు కాకుండా, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు, స్వతంత్రంగా జీవించేందుకు కావలసిన సదుపాయాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ నుంచి విడుదలైన రూ.లక్ష చెక్కును వారికి మంత్రి అందజేశారు.