నిర్మల్ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేస్తాం

నిర్మల్ చరిత్రను భావితరాలకు అందజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

Update: 2025-01-06 16:30 GMT

దిశ, ప్రతినిధి నిర్మల్ : నిర్మల్ చరిత్రను భావితరాలకు అందజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నిర్మల్ ఉత్సవాల 2వ రోజు సోమవారం రాత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి సీతక్కకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పూల మొక్కతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నిర్మల్ చరిత్రపై పరిశోధనలు జరిపి భవిష్యత్ తరాలకు తెలియజేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వినూత్నంగా జిల్లాలో నిర్మల్ ఉత్సవాల పేరిట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అభిలాషను మంత్రి అభినందించారు.

    నిర్మల్ జిల్లా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమన్నారు. నిర్మల్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్, మహిళా స్వయం సంఘాలచే ఏర్పాటు చేసిన స్టాళ్లు గొప్పగా ఉన్నాయని అభినందించారు. ఖానాపూర్ శాసనసభ్యులు బొజ్జు పటేల్ మాట్లాడుతూ నిర్మల్ కు ఘనమైన చరిత్ర ఉందని, బయట ప్రపంచానికి తెలిపేలా ఇలాంటి ఉత్సవాలు నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు. ఉత్సవాలను విజయవంతం చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

    అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లా చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క, ఇతర ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులను జిల్లా కలెక్టర్ శాలువాతో సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లు, ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీలు అవినాష్, రాజేష్ మీనా, ఉపేంద్ర రెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 


Similar News