కేసీఆర్ పాలన.. దేశానికే దిక్సూచి : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
దిశ, హుజూరాబాద్: కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్లీనరీలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తమ హాయాంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేస్తున్నారా అని చెప్పాలన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా రక్తపాతాలు, ఆత్మహత్యలు ఆగిపోయాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ప్రజల కళలను సాకారం చేశారన్నారు. రాష్ట్ర విభజన ప్రకారం రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మంజూరు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ అదానీ, అంబానీలకు మోదీ ప్రభుత్వం మేలు చేస్తుందన్నారు.
హుజూరాబాద్ ను మరో సిద్ధిపేట చేస్తా: కౌశిక్ రెడ్డి
తనకు అవకాశం ఇస్తే హుజూరాబాద్ నియోజకవర్గాన్ని మరో సిద్ధిపేటగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలన్నారు. మున్సిపాలిటీ, ఇతర స్థానిక సంస్థల చైర్మన్లు, ఎంపీపీలపై అవిశ్వాసం పెట్టవద్దని అధిష్టానం సూచిందన్నారు. ఏకైక లక్ష్యం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయమేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పోరేషన్ చైర్మెన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్ పర్సన్ కనుమళ్ల విజయ, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.