దేవుళ్లను సైతం మోసం చేస్తున్న వ్యక్తి K.C.R : Y. S. Sharmila
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల్ని కాకుండా దేవుళ్ళను కూడా మోసం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వైఎస్‌ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
దిశ, జగిత్యాల ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల్ని కాకుండా దేవుళ్ళను కూడా మోసం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వైఎస్‌ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటిస్తున్న షర్మిల మాట్లాడుతూ.. ధర్మపురి నియోజకవర్గానికి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తలమానికంగా ఉందని నాడు వైయస్ హయాంలో ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ రాష్ట్రంలోని ఆలయాలకు చేసిందేమీ లేదని తెలిపారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధూప దీప నైవేద్య కార్యక్రమాన్ని ధర్మపురి ఆలయం నుండే ప్రారంభించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో యాదాద్రి ఆలయం ఒకటే లేదని మిగిలిన ఆలయాలను కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చురకలు అంటించారు. తెలంగాణలోని వేములవాడ ధర్మపురి ఆలయాల అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి దేవుళ్ళను కూడా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. వైఎస్ హయాంలో ధర్మపురికి ముప్పై పడకల ఆసుపత్రి ఇస్తే కేసీఆర్ దానిని వంద పడకలకు పెంచుతామని హామీ ఇచ్చి తప్పారని అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని అబద్ధపు ముఖ్యమంత్రి పెద్ద మోసగాడు అని మరోవైపు మునుగోడులో జరుగుతున్న ఎన్నికలు మోసగాళ్లకు మెగా మోసగాళ్లకు జరుగుతున్న ఎన్నికలని తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు.
అనంతరం స్థానిక ఎమ్మెల్యే సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురించి మాట్లాడుతూ.. కేవలం 440 ఓట్ల తేడాతో గెలిచి సామాజిక వర్గ సమీకరణాలలో భాగంగా మంత్రి పదవి తెచ్చుకున్న కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో వరదలు వచ్చి ఇల్లు కొట్టకపోతే కనీసం పట్టించుకోని మంత్రి అని మండిపడ్డారు. వందల ఎకరాల భూమి కబ్జాలు చేయడంతో పాటు ఇసుక మాఫియా చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు ప్రశ్నించే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి వేధించే వాడంటూ ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి పాలన రూపుమాపి రాజన్న రాజ్యం తిరిగి తీసుకువచ్చేందుకే పాదయాత్ర చేస్తున్నానని తమ అధికారంలోకి వచ్చాక విద్యార్థుల నుండి ఉద్యమకారుల వరకు రైతుల నుండి రైతు కూలీల వరకు ప్రతి ఒక్కరిని ఆదుకోవడంతోపాటు రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.