సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Update: 2023-03-19 10:28 GMT

దిశ ప్రతినిధి రాజన్న సిరిసిల్ల: ఉపాధి కరువై నిరాశతో సూసైడ్ చేసుకున్న సిరిసిల్ల మున్సిపల్ బి వై నగర్ చెందిన నవీన్ కుటుంబాన్ని ఆదివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి నిరుద్యోగికి ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించడం కేటీఆర్ బాధ్యత.. నవీన్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నియామకాలను ఆంధ్ర వాళ్ళు కొల్లగొడుతున్నారని రాజకీయాలకతీతంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. 9 ఏళ్ల అనంతరం కూడా నేటికీ ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులే తెలంగాణలో కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటికి రు.60 వేల కోట్ల అప్పు ఉండగా అది నేడు రు.5 లక్షల కోట్ల అప్పుగా మారిందన్నారు. పుట్టబోయే ప్రతి బిడ్డపై రు.1.25 లక్షల అప్పుల భారం వేశారని అన్నారు.

తెలంగాణ ఉద్యమ కాలంలో హైదరాబాద్ తెలంగాణ సొత్తు అని ఉద్యోగాలన్నీ ఇక్కడి వారికి ఇవ్వాలంటూ ఉద్యమించామని గుర్తు చేశారు. హైదరాబాదులో నెలకొల్పుతున్న సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్ లో తెలంగాణకు చెందిన నిరుద్యోగ యువతకు 10 శాతం కూడా ఉద్యోగాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో 90 శాతం స్థానికులకే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అటువంటి ఈ చట్టం లేకపోవడంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించని పరిస్థితి నెలకొందన్నారు.

సిరిసిల్ల పట్టనానికి చెందిన ఉద్యోగం లభించక నిరాశ నిస్పృహతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. నవీన్ గ్రూప్ 1 ఇతర పోటీ పరీక్షలు దరఖాస్తు చేయనప్పటికీ, ప్రైవేట్ రంగంలో ఉపాధి లభించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. నవీన్ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ చెప్పడం సంతోషకరమని.. హామీలు మాటలకే పరిమితం కాకుండా నవీన్ కుటుంబానికి రు.50 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని ఆయన కోరారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రతి నిరుద్యోగికి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించాల్సిన బాధ్యత మంత్రి కేటీఆర్ దేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో కనీసం 50% అయినా స్థానికులకు కేటాయించెలా చట్టం చేయాలన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తో లక్షలాది మంది నిరుద్యోగ యువకుల్లో నిరాశ నెలకొంది అన్నారు.

ప్రభుత్వానికి ఏం సంబంధం లేదంటూ.. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. టీఎస్పీఎస్సీ స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అంటూ.. ప్రభుత్వానికి అజమాయిషీ లేనప్పుడు సీఎం కేసీఆర్ ఏ విధంగా సమీక్షించారని నిలదీశారు. టీఎస్పీఎస్సీ ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్న సంస్థ అనడానికి ఇదే ఉదాహరణ అని స్పష్టం చేశారు. పేపర్ లీకేజీలు వాస్తవాలు వెలిగి తీసేందుకు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని నాలుగేళ్లు గడుస్తున్నాయన్నారు. నిరుద్యోగ యువతకు ఇకనైనా ఏప్రిల్ నుండి నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ సంగీతం శీను బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News