పునరావాస కేంద్రంలో మౌలిక వసతులు కల్పించాలి

సింగరేణి భూనిర్వాసిత గ్రామం లద్నాపూర్ కు పన్నూర్, రత్నాపూర్ పరిధిలో కేటాయించిన పునరావాస కేంద్రంలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

Update: 2025-03-15 10:59 GMT

దిశ, రామగిరి : సింగరేణి భూనిర్వాసిత గ్రామం లద్నాపూర్ కు పన్నూర్, రత్నాపూర్ పరిధిలో కేటాయించిన పునరావాస కేంద్రంలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం కలెక్టర్ రామగిరి మండలంలోని సింగరేణి ఓసీపీ 2, లద్నాపూర్, రాజాపూర్ గ్రామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓసీ 2 విస్తరణలో భాగంగా రాజాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 88 ఎకరాల భూమిని సైతం రైతులు సింగరేణికి తప్పనిసరిగా అప్పగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. లద్నాపూర్ వద్ద పెద్దపల్లి మంథని రోడ్డు మళ్లింపు, ఎల్ 6 కెనాల్ మళ్లింపు పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

    లద్నాపూర్ గ్రామంలోని శ్రీరాముని ఆలయంలో రాబోయే శ్రీరామనవమి వేడుకల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, తాగునీటి సమస్య లేకుండా చూడాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. అనంతరం రాజాపూర్, లద్నాపూర్ గ్రామస్తులు వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణి మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ గోడు వెల్లబోసుకున్నారు. పునరావాస కేంద్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, త్వరగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని లద్నాపూర్ భూ నిర్వాసితులు కోరారు. రాజాపూర్ గ్రామస్తులు మాట్లాడుతూ సింగరేణి వల్ల గడిచిన పదేళ్లలో అన్ని రకాలుగా నష్టపోయామని, తమకు తగిన న్యాయం చేయాలని కలెక్టర్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, ఆర్జీ 3 జీఎం సుధాకర్ రావు, ఆర్ అండ్​ బీ ఈఈ భావ్ సింగ్, రామగిరి తహసీల్దార్ సుమన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం : పాశం ఓదెలు, మాజీ సర్పంచ్ రాజాపూర్

సింగరేణి బ్లాస్టింగ్లతో ఇండ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. దుమ్ము ధూళితో అనేక ఇబ్బందులు పడుతున్నాం. సింగరేణి సేకరించాలనుకుంటున్న 88 ఎకరాలతో పాటు రాజాపూర్ గ్రామాన్ని కూడా తీసుకోవాలి. లేదంటే భూముల్లో సింగరేణి అధికారులను అడుగు కూడా పెట్టనివ్వం. అంతేకాకుండా పనులను అడ్డుకుంటాం. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం. 


Similar News