కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆగమే..ధరణిని రద్దు చేస్తే రైతుబంధు రాదు : కేసీఆర్

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆగమవుతారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

Update: 2023-11-20 11:32 GMT

దిశ, తిమ్మాపూర్ : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆగమవుతారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ధరణి ద్వారా రైతులకు రైతుబంధు అమలు చేస్తున్నామని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తా అంటున్నారని, అలా అయితే రైతు బంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు. మానకొండూరులో రసమయిని మరోసారి గెలిపిస్తే హుజురాబాద్ తరహాలోనే మానకొండూరు నియోజకవర్గం లో కూడా తానే దగ్గరుండి ప్రతి దళిత కుటుంబానికి దగ్గరుండి దళిత బంధు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఓటర్లందరూ విజ్ఞతతో ఆలోచించి రాయి ఎదో రత్నమేదో గుర్తించి తమ ఓటు హక్కును వినియోగించాలని కోరారు.

బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని అంటున్నారని అప్పటి పాలన ఎలా ఉందో ఒక్కసారి గమనించాలని, తెలంగాణ ను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ కదా అని ప్రశ్నించారు. 58 ఎండ్లు తెలంగాణ కోసం పోరాటం చేశామని 1969లో తెలంగాణ సాధనలో విఫలమైనామని అన్నారు. 2004 లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు తెలంగాణ ఇవ్వక మోసం చేసిందని అన్నారు. ఆసరా ఫించన్ 1000 రూపాయలతో మొదలు పెట్టినప్పుడు దాన్ని 5000 వేలకు పెంచుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, రోడ్లు లేవు ఆసుపత్రులు,అంబులెన్స్ లు లేక అవస్థలు పడ్డారని పేర్కొన్నారు. ఆటో రిక్షా వాళ్లకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో ఫిట్నెస్ ఛార్జీలు రద్దు చేస్తామని అన్నారు.

రైతులు సంతోషంగా ఉండాలని కరెంట్ కష్టాలతో పాటు కాళేశ్వరం జలాలతో తెలంగాణ సస్యశ్యామలం చేశామని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలతో రైతులకు భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 24 గంటల కరెంట్ గురించి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో 20 గంటలు కరెంటు ఇస్తామని చెప్పి 5గంటలే ఇస్తున్నారని అందుకే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం నమ్మొద్దని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ను రద్దు చేస్తాం అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు రద్దు చేసి మళ్లీ పాత పటేల్ పట్వారీ లను తీసుకువచ్చి దళారుల రాజ్యం తెస్తారా..? అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమంటే నేను పెట్టా అని చెప్పినా అని అట్లా పెట్టుకుంటే 25 వేల కోట్లు కేంద్రం ప్రభుత్వం ఐదేళ్లలో రాకుండా చేసిందని, ఇప్పుడు ఆ పార్టీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు. కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మండల అధ్యక్షుడు రావుల రమేష్, ఎంపీపీ వనిత, ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:    

Similar News