కరెంటుతో మానవాళికి విడదీయలేని బంధం : కేటీఆర్

విద్యుత్ తో మానవాళికి విడదీయలేని అనుబంధం ఉందని

Update: 2024-10-25 07:10 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : విద్యుత్ తో మానవాళికి విడదీయలేని అనుబంధం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన సెస్ వినియోగదారుల బహిరంగ విచారణలో ఎమ్మెల్సీ ఎల్. రమణతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ విద్యుత్ అంటే వ్యాపారం కాదని, పురోగతి సాధించే రుతుచక్రమని, ప్రగతిని పరుగులు పెట్టించేదని సూచించారు. దేశంలోనే సహకార విద్యుత్ సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న ఏకైక విద్యుత్ సహకార సంస్థ సెస్ అని కొనియాడారు.

డిస్కం లతో పోలిస్తే సిరిసిల్ల సెస్ విద్యుత్ సేవలు నూరుపాళ్ళు మెరుగ్గా ఉన్నాయని, డిస్కంలను భారంగా కాదు ప్రభుత్వం బాధ్యతగా చూడాలని తెలిపారు. కరెంటు కోసమే తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ విద్యుత్ రంగంపై పెట్టిన పెట్టుబడులు స్వర్ణయుగం లాంటివని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో సర్వనాశనం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లలో ప్రజలపై ఒక్క రూపాయి విద్యుత్ భారం పెట్టలేదని, ప్రస్తుత ప్రభుత్వం ప్రజలపై 18 వేల కోట్ల విద్యుత్ భారం పెంచే ప్రతిపాదనలు పెట్టడం దుర్మార్గమైన చర్య అని, విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. డిస్కంల ప్రతిపాదనలు విరుద్ధంగా ఉన్నాయని, ప్రతిపాదించిన తొమ్మిదింటిని తిరస్కరించాలన్నారు.

గత పది నెలలుగా రాష్ట్రంలో పరిశ్రమలు దెబ్బతింటున్నాయని, కొత్త పరిశ్రమలు వచ్చే పరిస్థితులే లేవన్నారు. చార్జీలు పెంచితే కుటీర పరిశ్రమలు కూడా కుదేలైపోయే పరిస్థితిలో నెలకొంటాయని, చిన్న, సూక్ష్మ, కుటీర పరిశ్రమలను కాపాడుకుంటేనే, వాటిపై ఆధారపడ్డ లక్షలాదిమంది కార్మికులకు జీవనోపాధి దొరుకుతుందన్నారు.సిరిసిల్లాను మరో తిరుప్పూర్ చేయాలన్నదే కేసీఆర్ ఆశయమని, బతుకమ్మ చీరలతో పాటు ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చామని, దాంతోపాటు నేతన్నలకు 10 శాతం విద్యుత్ సబ్సిడీ కల్పించారన్నారు. ప్రస్తుతం సిరిసిల్ల మరమగ్గాల కార్మికుల బతుకులు అగమ్యగోచరంగా ఉన్నాయని, ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే పదిమందికి పైగా నేత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని గుర్తు చేశారు. సిరిసిల్లలో మరమగ్గాల వినియోగం పెరిగిందని, నేతన్నల ఆత్మహత్యలు ఆపేలా మానవీయ కోణంలో ఆలోచించి10 హెచ్పీ లకు 50 శాతం ఉన్న విద్యుత్ సబ్సిడీని 30 హెచ్పీ లకు పెంచి 50 శాతం సబ్సిడీ ఇచ్చి నేతన్నలను ఆదుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఈఆర్సీ ని విజ్ఞప్తి చేశారు.

జగిత్యాల ఎమ్మెల్యే రాజకీయ వ్యభిచారి..

ఈఆర్సీ బహిరంగ విచారణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సంచల వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మారడాన్ని ఉద్దేశించి రాజకీయ వ్యభిచారి అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చిత్ర విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయని, కాంగ్రెస్ వాళ్లను కాంగ్రెస్ వాళ్లే చంపుకుంటున్నారని, పోలీసు వాళ్లే పోలీసులను కొడుతున్నారని ఆరోపించారు. విద్యుత్ చార్జీల పెంపుపై అవసరమైతే ప్రజల పక్షాన ఉండి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పది నెలల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని సన్నాసులు, చేతనైతే వెంటనే ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయాలని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధుల అవినీతిని ఎండగడతామని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన వెనక్కి తగ్గ బోమని హెచ్చరించారు. రానున్న రోజుల్లో మళ్ళీ తమ ప్రభుత్వం మీ అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు.


Similar News