ఉత్కంఠ రేపిన న్యాయవాద అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎన్నికలు
కరీంనగర్ జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు శుక్రవారం జరిగిన ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపాయి.
దిశ, కరీంనగర్ లీగల్: కరీంనగర్ జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు శుక్రవారం జరిగిన ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపాయి. ఎన్నికల్లో న్యాయవాదులు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల అధికారి రామకృష్ణచారి రాత్రి 10.30 గంటల తర్వాత ఫలితాలను విడుదల చేసి అధ్యక్షుడిగా రఘునందనరావు, ప్రధాన కార్యదర్శి గా లింగంపెల్లి నాగరాజు తమ సమీప అభ్యర్థుల పై గెలుపొందినట్లు ప్రకటించారు. అనంతరం ఓడిన అభ్యర్థులు రీ కౌంటింగ్ కు డిమాండ్ చేశారు.
దీంతో ఎన్నికల అధికారి రామకృష్ణ చారి శనివారం కోర్టు లోని మీటింగ్ హాల్లో రీకౌంటింగ్ నిర్వహించారు. కాగా, అధ్యక్ష పదవికి గాను రఘునందన్ రావు కు 339 ఓట్లు రాగా రాజకుమార్ కు 316 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ప్రధాన కార్యదర్శి పదవికి గాను లింగంపెల్లి నాగరాజుకు 330 ఓట్లు రాగా బేతి మహేందర్ రెడ్డి కి 319 ఓట్లు వచ్చినట్లు ఆయన తెలిపారు. కాగా, రీకౌంటింగ్ సందర్భంగా అటు అభ్యర్థులతో పాటు ఇటు న్యాయవాదుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల అధికారి మరోసారి అధ్యక్షుడిగా రఘునందన్ రావును, ప్రధాన కార్యదర్శిగా లింగంపెల్లి నాగరాజు గెలుపొందినట్లు ప్రకటించారు.