Dharani Portal : ధరణి వచ్చినా ఆగని అక్రమాలు

దౌల్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం అక్రమాలకు కేరాఫ్‌గా అడ్ర స్‌గా మారింది. దౌల్తాబాద్ మండలం 33 గ్రామపంచాయతీలు కలిగి ఉన్నది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎప్పుడు ప్రజలతో కిక్కిరిసిపోయి ఉంటుంది.

Update: 2023-10-11 02:17 GMT

దిశ, దౌల్తాబాద్: దౌల్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం అక్రమాలకు కేరాఫ్‌గా అడ్ర స్‌గా మారింది. దౌల్తాబాద్ మండలం 33 గ్రామపంచాయతీలు కలిగి ఉన్నది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎప్పుడు ప్రజలతో కిక్కిరిసిపోయి ఉంటుంది. అదే స్థాయిలో కార్యాలయానికి వెళ్లిన ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా ధరణిని రూపొందించింది. దీంతో ధరణితో రిజిస్ట్రేషన్‌లలో మధ్యవర్తుల ప్రమేయం అటుంచితే.. ఉన్న భూములు పోయి రైతులు మల్లగుల్లాలు పడే పరిస్థితి ఏర్పడింది.

భూ సమస్యలు లేకుండా చేసేందుకు ధరణి పోర్టల్​ తీసుకొచ్చామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ ధరణి వచ్చినా లంచాల దందా మాత్రం ఆగడం లేదు. కొంతమంది మధ్యవర్తులు ఈ కార్యాలయంలోని అధికారులను తమ చేతుల్లో పెట్టుకొని పని కానీచేస్తున్నట్లు సమాచారం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సొంతంగా రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన రైతుల రిజిస్ట్రేషన్లు మాత్రం ఎటువంటి కారణం తెలియకుండానే రిజక్ట్ అవుతున్నాయి. దీంతో డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ల కోసం వెళ్లగా అవి రిజెక్ట్ అవ్వడంతో రైతులు ఎవరిని సంప్రదించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.

రికార్డు సెక్షన్ రూమ్‌లో ప్రైవేట్ వ్యక్తులు

దౌల్తాబాద్ తహసీల్ధార్ కార్యాలయంలో నుంచి రికార్డు సెక్షన్ రూమ్‌లో ప్రైవేట్ వ్యక్తులు ప్రవేశించడమే కాకుండా రికార్డులను సైతం బాహాటంగా బయట ప్రైవేట్ గా నిర్వహిస్తున్న ధరణి ఆన్లైన్ సెంటర్స్‌కి తరలిస్తున్నా అడిగే నాథుడే లేరు. పై స్థాయి అధికారులు అలా ఉంటే మేమేమన్నా తక్కువ తిన్నామా అన్నట్టు కింది స్థాయిలో ఉండే ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బంది సైతం పైసా లేనిది పని కాదన్న చందంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల విఆర్ఏ వ్యవస్థ రద్దైన తర్వాత వారు రికార్డ్ అసిస్టెంట్‌లుగా విధుల్లో చేరిన కూడా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఎమ్మార్వో కార్యాలయంలో రికార్డులు ముందేసుకుని పని చేస్తున్నారు. దీంతో వీఆర్ఏలు అందరు వెళ్లాక ఆఫీస్‌లో మీకు ఏం పని అది కూడా రికార్డు సెక్షన్లో ఉండవలసిన రికార్డులు మీ దగ్గరకు ఎలా వచ్చాయని దిశ ప్రశ్నించగా మా డ్యూటీ సార్ అని జూనియర్ అసిస్టెంట్ చెప్పిండు.

రికార్డ్ అసిస్టెంట్ ఉన్నా మాకు ఫైల్స్ టార్గెట్ కూడా పెట్టారని సమాధానం ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై ఉన్నత అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసి వదిలేస్తుండడం తో రాజకీయ పార్టీలకు చెందిన బడా బడా నాయకుల అండదండలతో తిరిగి విధుల్లో చేరడం జరుగుతుంది. దీంతో మహా అయితే షోకాజే కదా అనేలా అధికారులు దైర్యంగా నడిపించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి షోకాజ్‌తో చేతు లు దులుపుకోకుండా సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు కోరుతున్నారు.

ఆ నలుగురి కనుసన్నల్లోనే..

దౌల్తాబాద్ మండలంలో ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉండటం వలన వివిధ పనుల కోసం భారీ స్థాయిలో తహసీల్దార్ కార్యాలయానికి వస్తూ ఉంటారు. కానీ వారి పనులు జరగాలంటే మాత్రం కార్యాలయంలోని డిప్యూటీ తహసీల్దార్, రికార్డ్ అసిస్టెంట్‌లు, ఆర్ఐ‌లు, జూనియర్ అసిస్టెంట్ల చేతులు తడపాల్సిందేనని పలువురు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా రికార్డు సెక్షన్‌కి సంబంధించిన రూమ్ తాళాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండటం చేత వారు యథేచ్ఛగా తమ పనులను కొనసాగిస్తున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News