ఎమ్మెల్యేను వెంటాడుతున్న అవినీతి.. అధిష్టానం సీరియస్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేను అవినీతి వెంటాడుతోంది. నియోజకవర్గంలో మట్టి, ఇసుక అక్రమ రవాణా అతని కనుసన్నల్లోనే జోరుగా సాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2023-05-24 03:49 GMT

దిశ, కరీంనగర్​ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేను అవినీతి వెంటాడుతోంది. నియోజకవర్గంలో మట్టి, ఇసుక అక్రమ రవాణా అతని కనుసన్నల్లోనే జోరుగా సాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన నియోజకవర్గంలోని ఇటుక బట్టిలకు చెరువు మట్టి రవాణా విషయంలో ఆ ఎమ్మెల్యే హస్తం ఉందనేది జగమెరిగిన సత్యం. నియోజకవర్గంలోని పలు చెరువుల నుంచి మట్టి రవాణాకు ప్రభుత్వానికి తక్కువ మొత్తంలో రాయల్టీ చెల్లించి ఎక్కువ మొత్తంలో మట్టి తరలించాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతి తీసుకున్న దానికి కంటే ఎక్కువ మొత్తంలో మట్టి తరలింపుతో రూ.కోట్లు ఆర్జించినట్లు నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది.

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో అక్రమంగా మట్టి రవాణా విషయంలో ఆయన అవినీతిపై పెదవి విప్పడం లేదు. లారీలు ఓవర్​ లోడ్​తో వెళ్తున్న భారీ వాహనాలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నియోజకవర్గ పరిధిలో ఇసుక అక్రమ రవాణా విషయంలో సైతం ఎమ్మెల్యే హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతిలో ఎమ్మెల్యే వాటతోపాటు ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీలకు సైతం పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో టికెట్​ డౌటే..?

ఎమ్మెల్యే అవినీతిపై అధికార పార్టీ అధిష్టానం సైతం అసంతృప్తి గా ఉన్నట్లు తెలిసింది. మట్టి, ఇసుక రవాణా తో పాటు నియోజకవర్గంలోని కాంట్రాక్టర్​ పనుల విషయంలో సైతం సదరు ఎమ్మెల్యేను పిలుచుకొని వార్నింగ్​ ఇచ్చినట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్​ ఇస్తే సీటు కోల్పోయే పరిస్థితి ఉందని భావించిన పార్టీ అధిష్టానం మరో వ్యక్తి కోసం అన్వేశిస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో టికెట్​ ఆశిస్తున్న వారి వివరాలు సేకరించినట్లు సమాచారం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో టికెట్​ రాదని సొంత పార్టీ నేతలే ప్రచారం చేస్తుండటం గమనార్హం.

ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన అస్త్రం

ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలు ప్రతిపక్ష పార్టీలకు అస్త్రాలుగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అవినీతిని ముందుకు పెట్టుకొని ఎన్నికల ప్రచారానికి ముందుకు సాగాలని చూస్తున్నారు. ఇప్పటికే మట్టి, ఇసుక అక్రమ రవాణాపై గ్రామ గ్రామాన ప్రచారం ప్రారంభించిన ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే అవినీతి అంశంతోనే ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అవినీతే వచ్చే ఎన్నికల్లో అధికారానికి దూరం చేయడం ఖాయమని నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News