దారులన్నీ ధర్మపురి వైపే
ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ సభ కోసం కాంగ్రెస్ శ్రేణుల దండు కదిలి రాగా దారులన్నీ ధర్మపురి వైపే జతకట్టాయి.
దిశ, వెల్గటూర్ : ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ సభ కోసం కాంగ్రెస్ శ్రేణుల దండు కదిలి రాగా దారులన్నీ ధర్మపురి వైపే జతకట్టాయి. ధర్మపురి నియోజక వర్గంలోని నలుమూలల నుండి వేలాదిమంది బహిరంగ సభకు తరలి రాగ ధర్మపురి జనసంద్రం అయింది. సభకు వచ్చిన జనంతో మైదానం కిక్కిరిసి పోగా బయట నుంచి జనం ఆసక్తిగా రేవంత్ మాటలను ఆలకించి యువత ఈలలు కేకలతో హోరెత్తించారు. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ గెలిచినా ఓడిన 20 ఏళ్లుగా ప్రజల్లోనే ఉంటూ సమస్యల పై పోరాటం చేసున్నాడని, గత ఎన్నికల్లో మీరంతా ఆదరించి ఓటువేసి గెలిపించిన ఇప్పటి మంత్రి కొప్పులఈశ్వర్ అధికారుల సహకారంతో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఇతన్ని ఓడించిన సంగతి మీ అందరికీ తెలిసిందే అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే మీ కష్టాలు తీర్తాయి, అందరం కలిసి అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బై బై చెప్పి సాగనంపుదామని పిలుపునిచ్చారు. సభకు అత్యధికంగా యువకులు కదలి రావడం చాలా సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి తనప్రసంగంలో ప్రత్యేకంగా యువతను గుర్తు చేశారు.
గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి.. జీవన్ రెడ్డి
గల్ఫ్ బాధితులు అధికంగా ఉండే ప్రాంతం ఇది, ఎదిగిన బిడ్డలంతా గల్ఫ్ కు వెళ్లి ఏటా 1200 కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని రాష్ట్రానికి తెస్తున్న గల్ఫ్ బిడ్డల బాధలు తీర్చడానికి గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి సూచించారు. బతుకు దెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్లి అసువులు బాసిన కార్మికుల కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిన గెలిచిన మీతోనే మీలోనే ఉంటూ ప్రజల సాధక బాధకాల్లో భాగస్వామి అవుతున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఓటువేసి గెలిపించాలని జీవన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మద్దుల గోపాల్ రెడ్డి, ఎండి బషీర్, దినేష్, చంద్రశేఖర రావు, గజ్జల స్వామి, నిశాంత్ రెడ్డి, కొలుముల దామోదర్ యాదవ్, శోభ, విజయలక్ష్మి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.