కొత్త పంథాలో సైబర్ నేరగాళ్ల మోసాలు.. యువతకు కమిషన్‌ల ఆశచూపి సైబర్ వల

ఆధునిక సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా

Update: 2024-06-26 14:05 GMT

దిశ,వెల్గటూర్ : ఆధునిక సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకుల ద్వారానే జరుపు కుంటున్నారు. ప్రతి మనిషీ ఆర్థిక వ్యవహారాలకు తోడు ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఆర్థిక లావా దేవీలన్నింటికి నేడు బ్యాంకులు కేంద్ర బిందువులు కాగా దాదాపు గా పేమెంట్ అన్ని ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి.ఈ క్రమంలో నిరక్షరాస్యులు గ్రామీణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు విసిరే వలలో పడి క్షణాల్లో బ్యాంకు ఖాతాల నుంచి లక్షలాది రూపాయల డబ్బును కోల్పోతున్నారు. గతంలో బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఆధార్ నెంబర్ అకౌంట్ నెంబర్ పిన్ నెంబర్ లేదా మీ ఏటీఎం టైం అయిపోయింది, కొత్తది తీసుకోవాలని చెప్పి ఫోన్ చేసి మన వద్ద నుంచి బ్యాంకు సమాచారం తీసుకుని ఖాతాలో ఉన్న డబ్బును క్షణాల్లో మాయం చేసేవారు.

ఇటీవల కాలంలో అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నందున బ్యాంకు ఖాతాలకు ఫోన్ నెంబర్ లింక్ అవుతుంది. వాట్సప్ కు క్యూఆర్ కోడ్, లింకులు పంపించి మీరు లాటరీ గెలిచారని లేదా, ఇంకో విధంగా ఆశ చూపి మనం లింకును ఓపెన్ చేయడంతో మన ఖాతాలో ఉన్న డబ్బు ను క్షణాల్లో మాయం చేసి మనకు చుక్కలు చూపించే వారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు మరో అడుగు ముందుకు వేసి సైబర్ నేరంలో తెలియక బాగ స్వాములయ్యే అమాయక యువతకు కమిషన్ల ఎరచూపి వారు దోచిన డబ్బును వీరి అకౌంట్ల ద్వారా ట్రాన్సాక్షన్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు కేసు ఒకటి వెల్లటూరు మండలంలో వెలుగులోకి వచ్చింది.

సైబర్ నేరాలకు సంబంధించి ఎండపల్లి మండలంలో ఒకరు అరెస్ట్.. ఒకరికి నోటీసులు

సైబర్ మోసానికి సంబంధించి మంగళవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుళ్లకోట గ్రామంలో ఓ యువకుడిని తెలంగాణ సైబర్ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లినట్టు సమాచారం అదేవిధంగా కర్ణాటకలో జరిగిన ఓ సైబర్ కేసులో ఇదే మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రమేయం ఉందని కర్ణాటక పోలీసులు బుధవారం వెల్గటూర్ వచ్చి సదరు యువకుడిని పట్టుకుని వారం రోజుల్లో సరైన జవాబు చెప్పాలని నోటీసు ఇచ్చి వెళ్లడం విశేషం. కాగా కొత్త పంథాలో జరుగుతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.

రూ.1.2 కోట్ల సైబర్ కేసులో ఎండపల్లికి లింక్..

కర్ణాటక రాష్ట్రం గదక్ జిల్లాలోని సిఈఎన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడాది క్రితం జరిగిన రూ.1.2కోట్ల కు సంబంధించి సైబర్ మోసం లో జగిత్యాల జిల్లా ఎందపల్లి మండలం కొత్తపేట గ్రామానికి లింక్ ఉన్నట్లు తేలింది.సీఈ ఎన్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 52 /2023 జూన్ నెలలో ఓ కేసు నమోదైంది. ఈ కేసును అక్కడి సైబర్ పోలీసులు లోతుగా విచారించగా దాని లింకులు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన యువకుని బ్యాంకు ఖాతాకు సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ కేసులో 1.13 లక్షల రూపాయలు సదరు యువకుని ఖాతా నుంచి ట్రాన్సాక్షన్ జరిగిందని, కర్ణాటక పోలీసులు బుధవారం వెల్గటూర్ విచ్చేసి సదరు యువకుడికి వారం రోజుల్లో దీనిపై సరైన జవాబు చెప్పాలని నోటీసులు ఇచ్చి వెళ్లారు.

నాకు తెలియకుండానే డబ్బులు వచ్చి వెళ్లాయి..

నా బ్యాంకు ఖాతాలోకి డబ్బులు నాకు తెలియకుండానే వచ్చి వెళ్లాయని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తపేట యువకుడు వాపోయాడు. ఏడాది క్రితం తాగిన మైకంలో ఓ లింక్ వస్తే దానిని ఓపెన్ చేసాను. ఆ తర్వాత లింక్ పంపిన వ్యక్తి తరుచు గా ఫోన్ చేసి విసిగిస్తే అతడి ఫోన్ ఎత్తటం మానేశానని ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని సదరు యువకుడు చెప్పడం విశేషం. విచిత్రం ఏమంటే ఈ కేసుకు సంబంధించి ఇతడి బ్యాంకు ఖాతాలోకి 1. 13 లక్షలు జమ కావడం ఆ తర్వాత డ్రా కూడా అవటం జరిగింది.అది రెగ్యులర్ గా వాడే ఖాతా కానందున ట్రాన్సాక్షన్ గురించి తనకి ఏమీ తెలియదని యువకుడు వాపోతున్నాడు. జరిగిన ట్రాన్సాక్షన్స్ గురించి వారం రోజులు కర్ణాటక రాష్ట్రం గద్దర్ జిల్లాలోని సీ ఈ ఎన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి సరైన సమాచారం ఇవ్వాలని దానికి సంబంధించిన 1.13 లక్షల డబ్బులు జమ చేయాలని లేదంటే నిన్ను అరెస్టు చేస్తామని కర్ణాటక పోలీసులు నోటీసు ఇచ్చి హెచ్చరించి వెళ్లిపోవడం విశేషం.

స్నేహితుడి మాట నమ్మి మోసపోయిన యువకుడు

స్నేహితుడి మాట నమ్మి మండలంలోనీ గుల్లకోట గ్రామానికి చెందిన ఓ యువకుడు మోసపోయాడు. కొత్త పంథాలో జరిగిన సైబర్ నేరానికి సంబంధించి సదరు యువకుడిని తెలంగాణ సైబర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. గుల్లకోట గ్రామానికి చెందిన యువకుడికి రమేష్ అనే స్నేహితుడు ఉంటాడు. రమేష్ ఓరోజు అతనికి ఫోన్ చేసి తనకు సహాయం చేయాలని కోరాడు. స్నేహితుడే కదా అని సరే అన్నాడు. అది ఎలాంటి సహాయం అంటే, రమేష్ లక్ష రూపాయలు ఇతడి ఖాతాకు పంపిస్తాడు. ఆ డబ్బును ఇతడు రమేష్ చెప్పిన అకౌంట్ కి పంపించాలి. అది వట్టి గానే కాకుండా అందుకు కమిషన్ కింద స్నేహితుడికి 1000 రూపాయలు కమిషన్ ఇస్తారు .వట్టి గానే 1000 రూపాయలు వస్తున్నాయి కదా అని సదరు యువకుడు స్నేహితుడు చెప్పిన మాటకు ఓకే అన్నాడు.

ఇంకేముంది రమేష్ తన స్నేహితుడు అకౌంట్ నుంచి రూ.30 లక్షలను వివిద ఖాతాలకు ట్రాన్సాక్షన్ చేశాడు. దీనికి గాను స్నేహితుడికి రూ.30 వేల రూపాయల కమిషన్ అందించాడు. ప్రతి సారి పంపించే లక్షను వేర్వేరు అకౌంట్లకు పంపించే విధంగా రమేష్ ఏర్పాటు చేసుకున్నాడు. ట్రాన్సాక్షన్స్ జరిగిన వెంటనే ఆ అకౌంట్ డిలీట్ అయ్యేది. పంపించిన అకౌంట్ మాత్రం గుల్లకోట యువకుడిది ,ఎవరికి పోతున్నాయి ఎక్కడికి పోతున్నాయి అనేది మాత్రం ఎవరికీ తెలిసేది కాదు పనైపోయిన తర్వాత వెంటనే అకౌంట్ డిలీట్ అయ్యేది. ఇటీవల జరిగిన సైబర్ నేరాలలో జరిగిన ట్రాన్సాక్షన్స్ కు గుల్లకోట యువకుడి అకౌంట్ కు లింకు ఉన్నట్లు అనుమానం రావడంతో మంగళవారం సైబర్ పోలీసులు గ్రామానికి విచ్చేసి సదరు యువకుని అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు సమాచారం. యువకులు జాగ్రత్త ఇలాంటి కమిషన్ దందాలకు వెళ్లి సైబర్ నేరాల్లో ఇరుక్కుని మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు.

సైబర్ మోసగాళ్ల వల నుంచి నుంచి తప్పించుకున్న సర్పంచ్

మండలంలోని గుడిసెల పేట గ్రామానికి చెందిన ఓ మాజీ సర్పంచ్ కు సైబర్ నేరగాళ్లు మూడు రోజుల క్రితం విసిరిన వల నుంచి తప్పించుకొని అతడు ఊపిరి పీల్చుకోవడం విశేషం.5 రూపాయల పాత నోటు పంపిస్తే రూ.5 లక్షల రూపాయలు ఇస్తామని ఓ లింకును వాట్సప్ గ్రూప్ లకు నాలుగు రోజుల క్రితం అగంతకులు షేర్ చేశారు. అది నిజమే అనుకొని గుడిసెల పేట మాజీ సర్పంచ్ చక్రపాణి లింకును ఓపెన్ చేసి నోటును పంపించారు. మీరు ఐదు లక్షలు గెలుచుకున్నారు. రూ.750 తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అటు నుంచి పోన్ చేశారు. తన ఫోన్ నుంచి కాకుండా వేరే ఫోన్ నుంచి అడిగిన డబ్బులు చెల్లించారు. రూల్స్ ఒప్పుకోవడం లేదు మీరు మరో 7 వేలు చెల్లించాలని ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ కు ఇతడు స్పందించలేదు. ఆ తర్వాత సదరు సర్పంచ్ కి అగంతకులు వీడియో కాల్ చేసి నమ్మబలికారు. కస్టమ్స్ వారు ఒప్పుకోవడం లేదని కష్టం ఆఫీసర్ డ్రెస్ లో ఉన్న ఓ వ్యక్తితో వీడియో కాల్ చేయించి నమ్మించే ప్రయత్నం చేశాడు. అయినా సదర్ సర్పంచ్ వారి బుట్టలో పడకుండా రూ.750 పోగొట్టుకొని సైబర్ నేరస్థుల వల నుంచి తప్పించుకున్నారు.

ఇలా అమాయక ప్రజల ఆశను ఆసరా చేసుకుని కొత్త కొత్త విధానాల్లో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతూ ప్రజల బ్యాంకు ఖాతాలోని డబ్బును లూటీ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాదారులు బహుపరాక్ అంటూ పోలీసులు ఓవైపు తరచుగా హెచ్చరిస్తున్న సైబర్ నేరస్తులు కొత్త పంథాలో విసురుతున్న సైబర్ వలలో పడి మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు మన స్మార్ట్ ఫోన్లకు పంపించే చిత్ర విచిత్రమైన లింకులు ఓపెన్ చేయవద్దు, తెలియని వ్యక్తులు మాట్లాడే కాల్స్ ను అటెండ్ చేసి పర్సనల్ డాటాను వారికి ఇవ్వడం వల్లనే మోసపోతున్న వారు చాలామంది ఉన్నారని, స్మార్ట్ ఫోన్ల వినియోగంలో బ్యాంకు ఖాతాదారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ జేబులను గుల్ల చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Similar News