రూ.30కోట్ల పైగా రిక్సోస్ మోసాలు..క్రిప్టో‌స్కామ్‌లో అరెస్టుల పర్వం

గత సంవత్సర కాలంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జరిగిన క్రిప్టో

Update: 2024-10-21 02:21 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి : గత సంవత్సర కాలంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జరిగిన క్రిప్టో కరెన్సీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు ఎట్టకేలకు బ్రేకులు పడ్డాయి. జగిత్యాల కు చెందిన ఓ బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను అరెస్ట్ చేశారు. రిక్సోస్ అనే ఓ అప్లికేషన్ ద్వారా పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలతో భారీగా పెట్టుబడులు పెట్టించినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఇది కేవలం ఒక యాప్ మాత్రమే నని ఇలాంటి మరికొన్ని యాప్ ల ద్వారా ఈ బ్లాక్ మార్కెటింగ్ చైన్ సిస్టం బిజినెస్ ఇంకా నడుస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ విషయంలో లోతైన దర్యాప్తు చేపట్టిన పోలీసులు మల్టీ లెవెల్ మార్కెటింగ్ కు సంబంధించిన మిగతా అప్లికేషన్స్ వాటిని రన్ చేస్తున్న ఏజెంట్లను పట్టుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు పోలీసులు సైతం ఇలాంటి వారిపై సమాచారం అందిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పిస్తున్నారు.

బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పొలిటిషియన్స్.

క్రిప్టో కరెన్సీ బాధితుల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఐడిఓసి లో పనిచేసే కొందరు సిబ్బంది, మరికొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు లక్షల్లో పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా జగిత్యాల బల్దియాకు చెందిన సుమారు 15 మంది కౌన్సిలర్లు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసినట్లుగా విశ్వసనీయంగా తెలియ వచ్చింది. సమాజంలో కీలక పాత్ర పోషించే వృత్తిలో ఉన్న మరి కొందరు వ్యక్తులు సైతం పెట్టుబడులు పెట్టి మోసపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నడంతో తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అని ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తుంది.

ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిందిలా..

జగిత్యాల పట్టణానికి చెందిన వేముల రమేష్ అనే వ్యక్తి రిక్సోస్ అప్లికేషన్ ద్వారా ఏడు లక్షలు పెట్టుబడులు పెట్టి మోసపోయానని పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ముఠాలో కీలకంగా ఉన్న జగిత్యాల కు చెందిన గుమ్మిడల్లా నర్సయ్య, కోయల్కర్ వేణు,ఆరె రాజేశ్, పురెళ్ల బాపు , కొట్టే మారుతి లతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. తనలాగా మరికొందరు మోసపోవద్దు అనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఈ ముఠాలో స్థానికంగా ఉండే నరసయ్య కీలక పాత్ర పోషించగా అతని పైన ఉన్న వ్యక్తులు నిజామాబాద్ ముంబై కేంద్రంగా ఈ బిజినెస్ రన్ చేస్తున్నట్లుగా వివరించాడు. జిల్లా వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టించి కోట్ల రూపాయలు స్కామ్ చేసినట్లుగా ఆరోపించాడు. ఇన్వెస్ట్ చేయడం తో పాటు చేయించిన వారికి ర్యాంకులను ఇస్తూ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించడానికి విదేశీ టూర్లు, ఐఫోన్లు, ఖరీదైన కార్లు, విలాసవంతమైన ఫ్లాట్లను ఆశగా చూపినట్లుగా తెలిపాడు.

పెట్టుబడులు పెట్టించిన వారిలో వణుకు..

తాజాగా పోలీసులు ఈ స్కాంలో ఇన్వాల్వ్ అయిన కొంత మందిని అరెస్టు చేయడంతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టం ద్వారా పెట్టుబడులు పెట్టించిన వారిలో వణుకు మొదలైంది. ఫ్రాడ్ చేస్తారని తెలియక తాము పెట్టడంతో పాటు మరికొందరితో పెట్టుబడులు పెట్టించినట్లుగా వాపోతున్నారు. అయితే ఇందులో పెట్టుబడులు పెట్టించిన వారు కొందరు ఇదివరకే ఇన్వెస్ట్ చేసిన వారితో రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదులు చేయకుండా సెటిల్మెంట్ చేసుకునేందుకు రావాలని రాయబారం పంపుతున్నట్లు గా సమాచారం. వాస్తవానికి ఈ మార్కెటింగ్ స్కీం లో కొందరు మినహా మిగతా వారికి మోసం చేస్తారని తెలియక కమిషన్ల కక్కుర్తిలో పడి అనేక మంది అమాయకులు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారితో భారీగా పెట్టుబడులు పెట్టించారు. పెగడపల్లి మండలానికి చెందిన ఓ గ్రామంలో ఏకంగా సగం ఊరికి పైగా ఇందులో పెట్టుబడులు పెట్టడం ఆశ్చర్యం కలిగించక మానదు.

పెట్టుబడుల పై ముందే హెచ్చరించిన "దిశ"..

క్రిప్టో కరెన్సీ,మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా జరుగుతున్న మోసాలపై పెట్టుబడులు పెట్టవద్దని మూడు నెలల క్రితమే దిశ హెచ్చరించింది. ఈ మార్కెటింగ్ ద్వారా జరుగుతున్న మోసాలను ప్రజలకు వివరించే విధంగా వరుస కథనాలను ప్రచురించింది. దిశ కథనాలతో అనేకమంది పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన వారు సైతం ఉపసంహరించుకున్నారు. దీంతో దిశలో కథనాలు ప్రచురితం అయిన తర్వాత క్రమంగా ఇన్వెస్ట్మెంట్స్ తగ్గడంతో ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ నిర్వాహకులు రోజుల వ్యవధిలోనే బోర్డు తిప్పేశారు. దీంతో మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భయంతో వెనకడుగు వేశారు.తాజాగా వేముల రమేష్ అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తనలాగా మోసపోయిన వారు సైతం బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని తెలిపాడు. పోలీసులు సైతం ఇలాంటి మోసాలపై ధైర్యంగా వచ్చి కంప్లైంట్ చేస్తే న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు.


Similar News