పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

విధి నిర్వహణలో, దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్

Update: 2024-10-21 06:14 GMT

దిశ,చందుర్తి : విధి నిర్వహణలో, దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ పోలీస్ ఫ్లాగ్ డే ను జిల్లాలోని అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నిర్వహించారు. అమరుల త్యాగాలు, ఆశయాల సాధన దిశగా ముందుకు సాగాలని,దేశం కోసం, దేశ ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన పోలీస్ అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం అని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అన్నారు. చందుర్తి మండలం లింగం పేట గ్రామ శివారులో గల అమరవీరుల స్థూపం వద్ద జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ , అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ప్రజావసరాల కోసం, సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు.శాంతిభద్రతల పరిరక్షణ తో పాటు దేశ అంతర్గత భద్రత ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భంలోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు జాతీయ ఐక్యత కోసం ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారని ,ఇది అభినందనీయమని కలెక్టర్ అన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అక్టోబర్ 21,1959 సంవత్సరం లో సీఆర్పీఎఫ్ ఎస్.ఐ కరమ్ సింగ్ నాయకత్వంలోని 20 మంది భారత జవాన్లు కలిసి లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ మన వారిపై దాడి చేసి 10 మందిని హతమార్చినదన్నారు. అప్పటి నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్-21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా ప్రభుత్వం పాటిస్తుందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంను పోలీస్ ఫ్లాగ్ డే గా జరుపుకుంటున్నాం అని, పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరుతుందన్నారు. ఈ సమాజం కోరుకునేది శాంతి, స్థిరత్వం,అభివృద్ధి.పోలీస్ శాఖ వారి త్యాగాల ద్వారా ఎన్నో దశాబ్దాలుగా భౌతిక రక్షణ నుండి, సామాజిక రుగ్మతలను పారద్రోలడం వరకు పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ కార్యదీక్షతో , సేవాతత్పరత తో పని చేస్తుందన్నారు.విధి నిర్వహణలో ప్రాణాలర్పించి అమరవీరులైన పోలీసుల త్యాగాలు వెల కట్టలేనివి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ క్రమం తప్పకుండా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణార్థం పోలీస్ ఫ్లాగ్ డే ను ఘనంగా నిర్వహిస్తోందన్నారు.


Similar News