వడ్ల కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి : వేములవాడ ఎమ్మెల్యే

వరి ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి రైతులు కొనుగోలు కేంద్రాల్లో

Update: 2024-10-21 06:57 GMT

దిశ, వేములవాడ : వరి ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి రైతులు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు ఆరబోసుకునే క్రమంలో వారికి సరిపడా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. సోమవారం వేములవాడ పట్టణంలోని బాలనగర్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వేములవాడ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతును రాజు చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పమని, సన్నరకం వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

20 సంవత్సరాల క్రితం దళారీ వ్యవస్థ కు స్వస్తి పలికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, కొనుగోలు కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాలకు,ఫ్యాక్స్, డీసీఎంఎస్ లకు అప్పజెప్పినట్లు గుర్తు చేశారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఉచిత విద్యుత్ పంపిణీ ఫైల్ పై తొలి సంతకం చేయడం జరిగిందని, క్షేత్ర స్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ అకాల వర్షాల వల్ల రైతులకు ఏమైనా ఇబ్బందిగా తలెత్తితే తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.

గతంలో లారీల కొరత ఉంటే దానిని అధిగమిస్తూ ప్రస్తుతం ఐదు ఏజెన్సీలకు లారీలను సరఫరా బాధ్యత అప్పజెప్పడం జరిగిందని, రైతులకు మేలు కలిగే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి-రాజు, వైస్ చైర్మన్ బింగి మహేష్, నాయకులు సంగ స్వామి యాదవ్, చిలుక రమేష్, పుల్కం రాజు, సోయినేని కరుణాకర్, పాత సత్యలక్ష్మి, కూరగాయల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు


Similar News