ప్రధాన రహదారి పై ప్రమాదకర గుంతలు..

కరీంనగర్ - సిరిసిల్ల ప్రధాన రహదారిలోని నాంపల్లి వద్ద రోడ్డు మధ్యలో ఏర్పడిన భారీ గుంతలు వాహనదారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Update: 2024-10-21 09:46 GMT

దిశ, వేములవాడ : కరీంనగర్ - సిరిసిల్ల ప్రధాన రహదారిలోని నాంపల్లి వద్ద రోడ్డు మధ్యలో ఏర్పడిన భారీ గుంతలు వాహనదారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి మధ్యలో గుంతలు ఉండడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయంభయంగా వెళ్ళే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో అయితే తమ కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని, ఈ గుంతతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నామని నిత్యం అటుగా వెళ్లే వాహనదారులతో పాటు రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు చెబుతున్నారు. అదే సమయంలో రాత్రి వేళల్లో ఇక్కడ ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగినట్లు సమాచారం.

అయితే ఈ గుంత సమస్య గత కొన్ని నెలలుగా ఇలాగే ఉంటున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు కేవలం మట్టి పోసి తాత్కాలికంగా మరమ్మత్తులు చేస్తున్నారే తప్పితే పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం చేయడం లేదని, దీంతో ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రోడ్డు పై ఇబ్బందికరంగా మారిన గుంతలు పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు. గుంతలో నీరు నిల్వ ఉండడంతో దోమలు, ఈగలు చేరి వ్యాధులు తమకు ప్రబలే అవకాశం ఉందని, గుంతలు పడిన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికులు వేడుకుంటున్నారు.


Similar News