ధర్నాల పేరుతో బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారు.. ప్రభుత్వ విప్

ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు.

Update: 2024-10-21 11:41 GMT

దిశ, ధర్మారం : ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా మండలంలోని నర్సింగాపూర్, పత్తిపాక గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను, జిల్లా సివిల్ సప్లై అధికారులతో కలసి ప్రారంభించారు. ఆ తర్వాత మల్లాపూర్, కమ్మరిఖాన్ పేటతో పాటు మరో ఎనిమిది చోట్ల వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, 61 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా మాట్లాడుతూ రైతు భరోసా పథకం పై బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఏనాడూ రైతులను పట్టించుకోకుండా, ఇప్పుడు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హమీల్లో రైతు భరోసా పథకం ఉందని, ఒక్కొక్కటిగా అన్ని పథకాలను ప్రజలకు అందిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు దీపావళిలోపు రెండు లక్షల రుణమాఫీని, తానే బాధ్యత తీసుకొని, తీసుకున్న రుణాలు మాఫీ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మెన్ రుప్లా నాయక్, పత్తిపాక సింగిల్ విండో చైర్మెన్ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరపతి రెడ్డి పాల్గొన్నారు.


Similar News