నా భర్తను చంపింది ఒక్కరు కాదు ముగ్గురు.. ఓ మహిళ ఆవేదన..

న్యాయం చేయాలని బంధువులు గ్రామస్తులతో కలిసి ఓ మహిళ డీజిల్ డబ్బాతో నిరసనకు దిగి ధర్నా చేసిన సంఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది.

Update: 2024-10-21 14:41 GMT

దిశ, మెట్ పల్లి : న్యాయం చేయాలని బంధువులు గ్రామస్తులతో కలిసి ఓ మహిళ డీజిల్ డబ్బాతో నిరసనకు దిగి ధర్నా చేసిన సంఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామనికి చెందిన పల్లపు సాయిలును ఆదివారం తన తమ్ముడే హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే మృతుడు సాయిలును చంపింది సాయిలు తమ్ముడితో పాటు మరో ఇద్దరు ఉన్నారని మృతుని భార్య నవ్య ఆరోపించారు. తమ కుటుంబానికి న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తీసుకెళ్ళేది లేదని మొదట మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరసనకు దిగి అనంతరం బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నవ్య మాట్లాడుతూ తన భర్త పల్లపు సాయిలును మొత్తం ముగ్గురు కలిసి పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని ఆరోపించారు.

మృతుని మెడలో తులం బంగారు చైన్, 40000 విలువగల ఫోన్, పదివేల రూపాయలు లాక్కుని తన భర్త పై ఇద్దరు తమ్ముళ్లు, మరో మేకల మంద యజమానితో కలిసి తన భర్త హత్యకు కారకులయ్యారని ఆరోపించారు. గతంలో భూవివాదాలు ఉండేవని గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయని, పోలీస్ స్టేషన్లో కేసు కూడా కేసులు నమోదయిందని అన్నారు. తన భర్త మృతి చెందడంతో ఇద్దరు కూతుళ్లకు ఆధారం లేకుండా పోయిందని కన్నీరుమున్నీరయ్యారు. తన పిల్లలకు న్యాయం చేయాలని లేదంటే డీజిల్ తో నిప్పట్టించు కుంటానని డిమాండ్ చేశారు. ధర్నా స్థలానికి చేరుకున్న డీఎస్పీ ఉమామహేశ్వరరావు బాధితురాలు నవ్యతో మాట్లాడి మీ కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. డీఎస్పీ వెంట సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై లు కిరణ్ కుమార్, రాజు, పోలీస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News